14 June, 2026 | 4:57 PM

ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి

14-06-2026 04:12 PM

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వినతిపత్రం సమర్పించిన కొక్కిరాల విశ్వప్రసాద్ రావు, ఆత్రం సక్కు

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసి పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని మాజీ డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కోరారు. ఆదివారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించిన అనంతరం పలు అభివృద్ధి అంశాలపై వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టుల మరమ్మత్తులు, కాలువల పూర్తి, అసంపూర్తి బ్రిడ్జిల నిర్మాణం, మారుమూల గ్రామాలకు బీటీ రోడ్లు, ఆసిఫాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు. సింగరేణి ప్రభావిత గ్రామాలకు DMFT, CSR నిధులు కేటాయించడం, 242 గ్రామ పంచాయతీల మౌలిక వసతుల కోసం SDF నిధులు విడుదల చేయడం, ఉషగాం హోజా తెగ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం, గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులు విడుదల చేయడం, కొత్త విద్యుత్ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.