ఒరిస్సా నుంచి కర్ణాటక వయా తెలంగాణ
కూసుమంచిలో 331 కిలోల గంజాయి పట్టివేత..!
రూ.1.65 కోట్ల విలువ చేసే గంజాయిని పట్టుకున్న కూసుమంచి పోలీసులు
ముగ్గురు నిందితుల అరెస్ట్.. ఏడుగురు పరారు
కూసుమంచి, ఆగస్టు 5 (విజయక్రాంతి): మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కూసుమంచి పోలీసులు గట్టి దెబ్బ కొట్టారు. కూసుమంచి మండలం జీళ్ళచెర్వు గ్రామ పరిసరాల్లో బోలోరో వాహనంలో అక్రమంగా రవాణా అవుతున్న 331 కిలోల గంజాయిని కూసుమంచి పోలీసులు చేజింగ్ చేసి పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
మరో ఏడుగురు పరారైయ్యారని కూసుమంచి ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. కూసుమంచి ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం ఒడిసా నుంచి కర్నాటక వైపుకు గంజాయి అక్రమంగా రవాణా అవుతున్నట్లు పక్కా సమాచారం మేరకు కూసుమంచి ఎస్‌ఐ నాగరాజు, మరో ఎస్‌ఐ దివ్య తన సిబ్బందితో పాటు ఈగల్ టీమ్ సభ్యులతో కలిసి జీళ్ళచెరువు గ్రామం సమీపంలో వాహనాన్ని చేజింగ్ చేసి పట్టుకున్నారు. వాహనంలో ఉన్న నిందితులను పట్టుకుని విచారణ చేయగా భారీ పరిమాణంలో గంజాయి అక్రమ రవాణా బయటపడింది.
రూ.1,65,50,000 విలువ చేసే ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు.ప్రాథమిక విచారణలో నిందితులు రాజమండ్రి, బెంగుళూరు, ఛత్తీస్గఢ్ ప్రాంతాలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు, అక్కడి నుంచి గంజాయిని సేకరించి వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. . ఈ ముఠా వెనుక మరింత పెద్ద నెట్వర్క్ ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనంతరం ఒక బొలెరో వాహానం, ఒక కారు, ఒక మోటార్ సైకిల్ ను, 331 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వంతల గోపీనాథ్, కర్నాటక ఎం. నాగరాజు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఖిలో లక్ష్మణ్ లను అరెస్ట్ చేయగా మరో ఎనిమిది మంది 1.బురిడి సీతారాం, 2. అలంగి లైసెన్, 3. మనోజ్ కుమార్, 4. శివప్ప, 5. దొండో @ రాజు, 6. కొర్ర లోకోన్, 7. మల్లిఖార్జున్, 8. మన్యం కార్తీక్ కుమార్ లు పరారీలో ఉన్నట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. దొరికిన నింధితుల నుంచి రూ.10వేల క్యాష్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.






