పెట్రోల్ బంక్‌లో తరచూ స్టాక్ కొరత.. వినియోగదారుల ఇబ్బందులు
మల్లాపూర్,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని ఏకైక పెట్రోల్ బంక్‌లో తరచూ పెట్రోలు, డీజిల్ స్టాక్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత పది రోజులుగా బంక్‌లో ఎప్పుడు ఇంధనం అందుబాటులో ఉంటుందో, ఎప్పుడు స్టాక్ అయిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మండల కేంద్రం కావడంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఇదే బంక్‌పై ఆధారపడుతున్నారు. అయితే తరచూ స్టాక్ లేకపోవడంతో వాహనదారులు ఇతర ప్రాంతాలకు వెళ్లి ఇంధనం నింపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
అత్యవసర సమయాల్లో కూడా ఇంధనం దొరకక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అలాగే బంక్‌లో ఉచిత గాలి, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కూడా సరిగా అందుబాటులో లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా మల్లాపూర్‌లోనే తరచూ ఇంధన కొరత ఏర్పడుతుండటంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పెట్రోలు, డీజిల్ సరఫరాను క్రమబద్ధీకరించడంతో పాటు వినియోగదారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.






