గాంధీ భవన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
హైదరాబాద్: గాంధీ భవన్‌లో(Gandhi Bhavan) 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జనరల్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర దినోత్సవం దేశంలోనే గొప్ప పండగ అని, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జరుపుకునే జాతీయ పండగ అన్నారు.
ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం లభించిందని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయుల స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దేశ చరిత్రను యువత సమగ్రంగా అధ్యయనం చేయాలని, ముఖ్యంగా నేటి జెన్-జీ తరం చరిత్రపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కుల, మతాల పేరుతో జరుగుతున్న చిచ్చు నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. ప్రశ్నించే హక్కు, ప్రశ్నించే స్వేచ్ఛ ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్య్రం సాకారమవుతుందన్న ఆయన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.






