ఎస్‌ఐ, పీసీ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, ఆగస్టు 20: రామగుండం పోలీస్ కమిషనర్, మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం అందిస్తున్న ఉచిత శిక్షణను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. గురువారం తన ఛాంబర్ లో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీపీ ప్రకాష్, బెల్లంపల్లి ఆర్‌ఐ సంపత్ లతో కలిసి ఉచిత శిక్షణ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అర్హులైన అభ్యర్థులకు శిక్షణ అందించడం జరుగుతుందని, 90 రోజుల పాటు నిర్వహించే ఈ ఉచిత శిక్షణలో అభ్యర్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ను ఉచితంగా అందించడంతో పాటు, ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు హైదరాబాద్కు చెందిన నిపుణులైన ఫ్యాకల్టీ ద్వారా ప్రత్యేక శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు.
ఎస్త్స్ర, పీసీ ఎంపిక ప్రక్రియలో కీలకమైన ఈవెంట్స్కు సంబంధించి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ అందించడం జరుగుతుందని, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సబ్జెక్టు కోసం వరంగల్ లోని లెజెండ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎం.రాధాకృష్ణ, కాకినాడలోని శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుంచి యాకయ్య, కరీంనగర్ లోని కెఎన్‌ఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి గోపి, హైదరాబాద్ లోని యూనిక్ ఇన్స్టిట్యూట్ నుంచి జి. రమేష్, బి.ఐ.పి. ఇన్స్టిట్యూట్ నుంచి నాగరాజు, జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ కోసం ఆర్.సి. రెడ్డి ఇన్స్టిట్యూట్ నుంచి సైదులు, తెలంగాణ హిస్టరీ సబ్జెక్టు కోసం జయశంకర్ ఇన్స్టిట్యూట్ నుంచి రవీందర్, జియోగ్రఫీ సబ్జెక్టు కోసం హైదరాబాద్ లోని యూనిక్ ఇన్స్టిట్యూట్ నుంచి వెంకట్ రెడ్డి, పాలిటి సబ్జెక్టు కొరకు హైదరాబాద్ లోని శ్రీ షైన్ ఇన్స్టిట్యూట్ నుంచి శ్రీనివాస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల కోసం హైదరాబాద్ లోని హెచ్.ఐ.పి. ఇన్స్టిట్యూట్ నుంచి రాజులను ఫ్యాకల్టీగా నియమించడం జరిగిందని తెలిపారు.
జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, ఈ నెల 31న తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. 8712538278, 94909 06773 నెంబర్ల ద్వారా అభ్యర్థులు తమ వివరాలు నమోదు చేసుకోవచ్చని, వాట్సాప్ ద్వారా సైతం వివరాల నమోదు జరుగుతుందని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పోలీ స్ ఉద్యోగాల సాధనకు కృషి చేయాలని తెలిపారు.






