21 August, 2026 | 3:52 AM

న్యాయం జరిగేంత వరకు రైతులకు అండగా బీఆర్‌ఎస్

21-08-2026 01:50 AM

 మాజీ మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి) : న్యాయం జరిగేంత వరకు రైతులకు అండగా బీఆర్‌ఎస్ ఉంటుందని మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్లో మార్పులు చేస్తూ రైతులకు తీవ్ర అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అనుకుంట గ్రామ రైతులు గురువారం మాజీ మంత్రి జోగు రామన్న నివాసానికి చేరుకొని ఏయిర్ పోర్టు నిర్మాణంపై న్యాయం జరిగేలా చూడాలని వినతి పత్రం అందజేశారు. జోగు రామన్న మాట్లాడుతూ.. ఎయిర్పోర్ట్ నిర్మాణంపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వకుండా అనుకుంటా గ్రామస్తులను అయోమయం, ఆందోళనకు గురిచేయడం సరికాదన్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకుంటా రైతులు, గ్రామస్తులకు అన్యాయం జరగకుండా బీఆర్‌ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. గతంలో కలెక్టర్ హైమద్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే, ప్లానింగ్ ప్రకారమే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారని తెలిపారు. గతంలో రూపొందించిన ప్రణాళికను పక్కన పెట్టి కొత్తగా అనధికారిక డీపీఆర్ రూపొందించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

ఎన్నో ఏళ్లుగా ఆదిలాబాద్ పట్టణానికి ఆనుకుని ఉన్న అనుకుంట గ్రామం సుమారు 800 ఎకరాల వ్యవసాయ భూములపై ఆధారపడి ఉందన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనుకూలంగా ఉన్న భూములు 68 సర్వే నంబర్లో ఉన్నప్పటికీ, వాటిపై స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి సారించకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. స్వలాభం కోసం డీపీఆర్ను మార్చి రైతుల భూములకు నష్టం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై పూర్తి స్థాయిలో వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువస్తామని అన్నారు.

రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా బీఆర్‌ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. అనుకుంటా గ్రామ రైతులు, గ్రామస్తులకు శాశ్వత పరిష్కారం లభించే వరకు వారి పక్షాన నిలబడి పోరాడుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు బండి దత్తాత్రి, మంచాల మల్లయ్య, కడదరపు అశోక్, రావుల రమేష్, ఆప్కం భూమయ్య, మోహిన్, రావుల సోమన్న, జక్కుల సత్యనారాయణ, బండి సాగర్, దూడ రాజేశ్వర్, ముఖ్యర శ్రీను.కమిటీ రమేష్, సలీం తదితరులు పాల్గొన్నారు.