21 August, 2026 | 3:03 AM

ఏటీఎంల వద్ద భద్రతయేది?

21-08-2026 02:03 AM
  1. మెదక్ జిల్లాలో పెరుగుతున్న ఏటీఎం చోరీలు
  2. భద్రతను గాలికి వదిలేసిన బ్యాంకులు
  3. ఏటీఎంల సెక్యూరిటీ బాధ్యత ఎవరిది..?

మెదక్, ఆగస్టు 20 (విజయ క్రాంతి) : బ్యాంకు ఖాతాదారుల సౌకర్యం కోసం అందుబాటులోకి తెచ్చిన ఏటీఎంల వినియోగం రోజురోజుకూ పెరుగుతున్నది. 24 గంటలపాటు డబ్బులు విత్డ్రాచేసుకోవడంతోపాటు జమచేసే వీలుకూడా ఉండడంతో వీటికి ఆదరణ పెరిగింది. చిన్నమొత్తాల ట్రాన్స్ఫర్ పూర్తిగా ఏటీఎంలలోనే జరుగుతున్నది. ఖాతాదాలకు మెరుగైన సేవలను అందించేందుకు అన్ని బ్యాంకులు తమ శాఖకు సంబంధించి ఏటీఎం సెంటర్లను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నాయి.

దీంతో వినియోగదారుల సమయం కూడా ఆదా అవుతున్నది. పెద్దమొత్తంలో నగదు లావాదేవీలు, నగలు తదితర విలువైన వస్తువులను భద్రపర్చుకునేందుకు మాత్రమే ఖాతాదారులు బ్యాంకులకు వెళ్తున్నారు. అయితే ఎక్కడపడితే అక్కడ అందుబాటులో ఉన్న ఏటీఎంల నిర్వహణతోపాటు భద్రత మాత్రం బ్యాంకులు గాలికి వదిలేశాయి. ఇందుకు జిల్లాలో జరుగుతున్న ఏటీఎం చోరీలే ఉదాహరణగా నిలుస్తున్నాయి.

ఏటీఎంలకు భద్రత ఏదీ?

ప్రతి బ్యాంకు తమ సేవలను విస్తృతం చేయడంతోపాటు ఖాతాదారులకు ఇబ్బంది కలుగకూడదలే ఉద్దేశంతో పోటీపడి ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నాయి. వీటిని 24 గంటల పాటు వినియోగించుకునే సౌకర్యం కల్పిస్తున్నాయి. ఒక్కో ఏటీఎంలో రూ.20-25 లక్షల వరకు డబ్బులను అందుబాటులో ఉంచుతున్నాయి. అయితే గతంలో ప్రతి ఏటీఎం సెంటర్ వద్ద ఒక సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేసేవారు.

టెక్నాలజీ పెరిగిన కొద్దీ సీసీ కెమెరాలు, అలారమ్ సిస్టమ్ అందుబాటులోకి రావడంతో కాపలాగా ఉన్న సిబ్బందిని తొలగిస్తూ వచ్చారు. సీసీ ఫుటేజీలు, అలారమ్ను సంబంధిత శాఖ మేనేజర్తోపాటు ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేశారు.

ఏటీఎం సెంటర్లో ఎవరైనా చోరీకి ప్రయత్నిస్తే భారీ శబ్దంతోకూడిన అలారం అప్రమత్తం చేసుంది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించే అవకాశం ఉంటుంది. ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పటికీ దొంగలు కూడా జాగ్రత్త పడుతూ చోరీలకు పాల్పడుతున్నారు.

ఏటీఎంలు టార్గెట్ చేస్తూ...

గ్యారెంటీగా పెద్దమొత్తంలో నగదు ఉంటుందని భావిస్తున్న దుండగులు ఏటీఎంలనే టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. ఏటీఎంలలో రెండు..మూడు లాక్స్, సీసీ కెమెరాలు, అలారమ్ వంటి భద్రత ఉన్నప్పటికీ చోరీకి ప్రయత్నిస్తున్నారు. ఏటీఎం లాక్స్ ఓపెన్ కాక చోరీకి విఫలయత్నం చేసిన ఘటనలు జిల్లాలో అనేకం నమోదవుతున్నాయి.

దీంతో దొంగలు ఏకంగా మెషిన్లనే పూర్తిగా ధ్వసం చేసి తమ టార్గెట్ను పూర్తి చేస్తున్నారు. బుధవారం మెదక్ మండలం మంబోజి పల్లి లోని ఎస్ బీఐ ఏటీఎంను పూర్తిగా ధ్వసంచేసి రూ.14 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. అంతే కాకుండా చిన్న శంకరం పేట మండలం గవల్లపల్లి లోని ఎస్ బీఐ ఏటిఎం లో సుమారు రూ. 16 లక్షలు చోరీకి గురయ్యాయి.

ఏటీఎంల సెక్యూరిటీ బాధ్యత ఎవరిది..?

ఏటీఎంల నిర్వహణ, భద్రతపై ప్రజల నుంచి అనేక విమర్శలు ఉన్నాయి. మెషిన్లు పనిచేయకపోయినా, సెంటర్లలో ఏం జరిగినా వాటిని పట్టించుకునేవారు ఉండరని అంటున్నారు. ప్రతిరోజూ పెద్దమొత్తంలో నగదు అందుబాటులో ఉండే ఏటీఎం సెంటర్ల వద్ద సెక్యూరిటీ సిబ్బంది ఉండాల్సిన అవసరం ఉంది.

కొన్ని ఏటీఎం సెంటర్లలో మోసగాళ్లు వినియోగదారులకు మాయమాటలు చెప్పి డబ్బులు కాజేయడం, ఏటీఎం కార్డులను మార్చడం వంటివి చేస్తున్నారు. అమాయకులకు టోపీ పెట్టి క్షణాల్లో మాయమవుతున్నారు. ఏటీఎంల చోరీ ఘటనలపై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకొంటున్నారు.