25 August, 2026 | 11:33 AM

కన్నాల పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత అల్పాహారం ప్రారంభం

25-08-2026 10:50 AM

మంథని, ఆగస్టు 25 (విజయ క్రాంతి): విద్యార్థులు ఉదయాన్నే పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా, ఉత్సాహంగా చదువుకోవాలనే లక్ష్యంతో కన్నాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు హరే రామ ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

కన్నాల గ్రామ సర్పంచ్ గుడిసె గట్టయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రతిరోజూ ఆరోగ్యకరమైన, పౌష్టికాహారం అందించడం వల్ల వారి శారీరక, మానసిక ఎదుగుదల మెరుగుపడటంతో పాటు చదువుపై మరింత ఏకాగ్రత పెరుగుతుందని అన్నారు. విద్యార్థుల సంక్షేమానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరి ప్రసాద్, స్థానిక వార్డు సభ్యురాలు కీర్తన విద్యార్థులకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు, పోషకాహారం అందించేందుకు సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, హరే రామ ఫౌండేషన్‌కు ప్రధానోపాధ్యాయులు హరి ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంపత్, వెంకటేశ్వర్లు, సావిత్రి, మమత, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.