25 August, 2026 | 12:02 PM

రేగా కాంతారావు వ్యాఖ్యలను ఖండించిన మాజీ ఎంపీపీ

25-08-2026 10:31 AM

అశ్వాపురం, ఆగస్టు 25(విజయక్రాంతి): పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తన ఆస్తిని పినపాక నియోజకవర్గ ప్రజలకు పంచాలని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు చేసిన సవాల్‌ను కాంగ్రెస్‌ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎంపీపీ, కాంగ్రెస్‌ పార్టీ మండల నాయకుడు ఊసా అనిల్‌కుమార్‌ అన్నారు. మంగళవారం అశ్వాపురంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. రేగా కాంతారావు గతంలో ఇసుక, మైనింగ్‌, భూ వ్యవహారాలు, కమిషన్ల ద్వారా అక్రమంగా వందల కోట్ల రూపాయలు సంపాదించారని ఆయన ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన సొమ్మును ప్రజలకు పంచుతాననడం సమంజసం కాదని విమర్శించారు. పాయం వెంకటేశ్వర్లు, రేగా కాంతారావు మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై రేగా కాంతారావు ఇష్టారీతిన విమర్శలు చేస్తే సహించేది లేదని, ప్రజాక్షేత్రంలో తగిన సమాధానం చెబుతామని ఊసా అనిల్‌కుమార్‌ హెచ్చరించారు.