25 August, 2026 | 12:03 PM

తుమ్మలచెరువులో నీళ్లున్నా.. రైతులకు వరి పంట వద్దంటారా..?

25-08-2026 10:29 AM

మారెళ్లపాడుకు పర్యటనలు కాదు..

పూర్తి ఆర్థిక అనుమతులు తీసుకురావాలి: మర్రి మల్లారెడ్డి

అశ్వాపురం, ఆగస్టు 25(విజయ క్రాంతి): తుమ్మలచెరువులో సుమారు 10 అడుగుల నీరు అందుబాటులో ఉన్నప్పటికీ ఆయకట్టు రైతులను వరి సాగు చేయొద్దని అధికారులు సూచించడం సరికాదని నెల్లిపాక పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్‌ మర్రి మల్లారెడ్డి విమర్శించారు. తుమ్మలచెరువు ఆయకట్టు రైతులకు వరి పంట ప్రధాన ఆధారమని, మారెళ్లపాడు ఎత్తిపోతల పథకంపై వరుస పర్యటనలు చేయడం కంటే ప్రాజెక్టుకు పూర్తి ఆర్థిక అనుమతులు తీసుకొచ్చి పనులు వేగంగా పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. మారెళ్లపాడు ప్రాజెక్టు ఒక్క తుమ్మలచెరువుకే కాకుండా అశ్వాపురం మండలంలోని మొత్తం రైతాంగానికి సాగునీరు అందించేందుకు ఉద్దేశించినదని పేర్కొన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ చివరి దశలో మారెళ్లపాడు ద్వారా నీరు అందించినా రైతులు వరి సాగు చేసే పరిస్థితి ఉండదని, ముందస్తు ప్రణాళిక లేకుండా వరి వేయొద్దని చెప్పడం రైతులను అయోమయానికి గురిచేస్తోందన్నారు. మారెళ్లపాడు డీపీఆర్‌ ప్రకారం పూర్తి ఆర్థిక అనుమతులు మంజూరు చేసి, పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి అశ్వాపురం మండల రైతాంగానికి సాగునీరు అందించాలని బీఆర్‌ఎస్‌ తరఫున మర్రి మల్లారెడ్డి డిమాండ్‌ చేశారు.