జిల్లాలో 40 ఎక్సైజ్ కేసులు నమోదు
అర్మూర్, (విజయక్రాంతి) : ఈ నెల ఒకటో తేదీ నుండి ఈ నెల 11 వరకు జిల్లా ఎక్సైజ్ శాఖ పరిధిలో 40 కేసులు నమోదైనట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి అరుణ్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖ పరిధి లో ఉన్న నిజామాబాద్ , ఆర్మూర్, బోధన్, భీమగల్, మోర్తాడ్ సర్కిళ్ల పరిధిలో 40 కేసులు నమోదు అయినట్లు పేర్కొన్నారు. ఈ కేసుల్లో 20 మందిని అరెస్టు చేసి 10 లీటర్ల గుడుంబా సీజ్ చేసినట్లు వివరించారు. 11 లీటర్ల ఎం.డి.పి.ఎల్., 25 లీటర్ల మద్యం సీజ్ చేసి, 20 కళ్ళు శాంపిల్స్ తీసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రతి శాఖలో బదిలీలు సర్వసాధారణమని, బదిలీల వల్ల పని ఆపడం అనేది జరగదని పేర్కొన్నారు. వచ్చే వారంలో స్పెషల్ డ్రైవ్ చేపడతామని పేర్కొన్నారు. మత్తు పదార్థాలు వినియోగం చేసే వారిని, అమ్మే వారిని , రవాణా చేసే వారిని ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని అన్నారు. వారిపై గట్టి నిఘా ఏర్పాటు చేశామని, పోలీస్ వారి సహకారాన్ని కూడ తీసుకుంటున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంతో పని చేసి సమాజానికి సేవ చేసే దృక్పథం తో ముందుకు వెళ్తామని వివరించారు.






