సోయం ముందస్తు వ్యూహం.. అధిష్టానం ఆదేశాలతో పల్లెబాట
బోథ్, ఆగస్టు 24,(విజయక్రాంతి): మాజీ ఎంపీ సోయం బాపురావు అధిష్టానం ఆదేశాలతో పల్లెబాట(Former MP Soyam Bapu Rao Palle Bata) పట్టారు. బిజెపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుండి కొంతకాలం స్తబ్దతగా ఉన్నారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోపాటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలతో పల్లెబాట పట్టారు. ముఖ్యంగా బోథ్ నియోజకవర్గంలో ప్రణాళిక బద్ధంగా గ్రామాలలోపర్యటిస్తున్నారు.
ముందస్తువమేనా
మాజీ ఎంపీ నియోజకవర్గంలో పర్యటించడం ముందస్తు వ్యూహంలో భాగమేనని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. మరో రెండు సంవత్సరాలు శాసనసభ ఎన్నికలు ఉండగా సోయం గ్రామాలలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటానని భరోసా ఇస్తుండడంతో ఆయన పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. నియోజకవర్గంలో ఆదివాసి గూడేలలో ఇతర వర్గాలలో పట్టును నిలుపుకునేందుకు సోయం పర్యటిస్తూనే కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు.
సంక్షేమ పథకాలు అమలుకు వ్యూహం
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు మాజీ ఎంపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఉన్న అనుబంధం వల్ల నేరుగా నిధులు తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే తన కోట కింద ఇందిర మహిళను తీసుకువచ్చి మంజూరు చేయడం జరిగింది. అభివృద్ధి పనుల్లో సైతం మాజీ ఎంపీ నిధులు తీసుకురావడంతో అనుచర వర్గం ఆయనకు మరింత దగ్గరగా అవుతున్నది. దీంతో ముందుచూపుతో అడుగులు వేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు....
పదునైన విమర్శలతో
సంచలనాలకు మారుపేరైన మాజీ ఎంపీ పలు సమావేశాలలో పదునైన విమర్శలతో ప్రతిపక్షం పైన దాడి చేస్తున్నారు. బి ఆర్ ఎస్ పార్టీ నియోజకవర్గంలో చేసిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ చేస్తే వీఆర్ఏ పార్టీ వారు మేము చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారంటున్నారు. ఒక అడుగు ముందుకు వేసి స్థానిక ఎమ్మెల్యే పైన నేరుగా విమర్శలు చేస్తున్నారు.






