700 పాఠశాలలు.. 40 వేల మంది విద్యార్థులకు అల్పాహారం
మంథనిలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభం
మంథని, ఆగస్టు 24 (విజయ క్రాంతి): మంథని పట్టణంలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(minister Duddilla Sridhar Babu) ప్రారంభించారు. ఈ కమ్యూనిటీ కిచెన్‌ను యూహెచ్‌కేఎం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సహకారం అందిస్తోంది.
ప్రజలకు అవసరమైన సమయంలో నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సామాజిక సేవా కార్యక్రమాలకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. పేదలు, కార్మికులు, అవసరమైన వారికి కమ్యూనిటీ కిచెన్ ద్వారా ఆహార సేవలు అందించడం మంచి కార్యక్రమమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నిర్వాహకులు, సింగరేణి ప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.







