calender_icon.png 12 February, 2026 | 8:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే సురేందర్

12-02-2026 02:46:47 AM

  1. పోలింగ్ కేంద్రాలకు ఎమ్మెల్యే వెళ్లడంపై బీఆర్‌ఎస్ ఆగ్రహం

మాజీ ఎమ్మెల్యేతో పాటు పార్టీ శ్రేణుల అరెస్ట్.. నాగిరెడ్డిపేట పీఎస్‌కు తరలింపు

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 11(విజయ క్రాంతి): ఎల్లారెడ్డి పట్టణంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పోలింగ్ బూతులకు ఎమ్మెల్యే వెళ్లడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు చేపట్టిన ఆందోళనతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.అధికారుల ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సురేందర్ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.పట్టణంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సేవ్ ఎల్లారెడ్డి అంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.రాష్ట్ర డీజీపీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఎల్లారెడ్డిలో మీ పోలీసుల లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది? నిబంధనలను ఉల్లంఘించి ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రాలకు వెళ్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారా?అని సూటిగా ప్రశ్నించారు.అధికారుల తీరు నిష్పక్షపాతంగా లేదని ఆయన మండిపడ్డారు.

నిరసనకారులతో రహదారిపై రాకపోకలు నిలిచిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు.ఆందోళన విరమించాలని కోరినప్పటికీ కార్యకర్తలు వెనక్కి తగ్గకపోవడంతో మాజీ ఎమ్మెల్యే సురేందర్ తో పాటు బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నేతలను, శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారిని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ అరెస్టుల సమయంలో పోలీసులకు,కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో పరిసర ప్రాంతాల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.