28 February, 2026 | 12:31 PM

కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు

28-02-2026 12:31 AM
  1. ప్రారంభమైన నిర్మాణ పనులు 

ఇక ఆ మార్గంలోట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): హైదరాబాద్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ట్రాఫిక్ కష్టాలు. అందులోనూ మాసాబ్ ట్యాంక్ నుంచి బంజారాహిల్స్ మీదుగా ఐటీ కారిడార్ హైటెక్ సిటీ, మాధాపూర్, గచ్చిబౌలి వెళ్లే దారిలో ఉండే రద్దీ అంతాఇంతా కాదు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2, ముగ్ధ జంక్షన్..

ఈ ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనాలు కిలోమీటర్ల మేర ఆగిపోతుంటాయి. ఈ ట్రాఫిక్ నరకా నికి శాశ్వతంగా చెక్ పెట్టాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. కేబీఆర్ పార్క్ చుట్టూ అసలు ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవే లేకుండా చేసేందుకు పనులు మొదలుపెట్టేసింది. ఇందులో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో మొదటి ఫ్లైఓవర్ పిల్లర్ కోసం తవ్వకాలు ప్రారంభించింది.

రెండేళ్లలో పూర్తి!

గతంలో ఈ ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి ఎస్‌ఆర్డీపీ కింద కొన్ని ప్లాన్లు గీశారు. ఇప్పుడు వాటినే హెచ్ సిటీ ప్రాజెక్టు పేరుతో జీహెచ్‌ఎంసీ అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా రూ.1,090 కోట్లు ఖర్చు చేయనున్నారు. రాబోయే రెండేళ్లలో ఈ ప్రా జెక్టును పూర్తి చేయాలని అధికారులు టార్గె ట్‌గా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఆరు స్టీల్ ఫ్లైఓవర్లు, ఆరు అండర్ పాస్లు నిర్మిస్తారు. ఇవి పూర్తయితే వాహనదారులు సిగ్నల్స్ దగ్గర ఆగాల్సిన అవసరం లేకుండా రయ్యిన వెళ్లిపోవచ్చు. దీనికోసం జనవరి లోనే మట్టి పరీక్షలు సాయిల్ టెస్టింగ్ పూర్తి చేసిన జీహెచ్‌ఎంసీ.. ఇప్పుడు పిల్లర్ల నిర్మా ణం మొదలుపెట్టేసింది.

అభ్యంతరాలున్నా వెనక్కి తగ్గని జీహెచ్‌ఎంసీ..

ఈ ఫ్లైఓవర్ల నిర్మాణం వల్ల కేబీఆర్ పార్క్ కు, అక్కడి పర్యావరణానికి ముప్పు వాటి ల్లుతుందని పర్యావరణవేత్తలు, వాకర్స్ తీ వ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పనుల కోసం దాదాపు 3 వేలకు పైగా భారీ చెట్లను నరి కేయాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్క్ చుట్టూ సిమెంట్, కాంక్రీ ట్ నిర్మాణాలు వస్తే లోపల ఉన్న పక్షులు, వన్యప్రాణులు పారిపోతాయని, పార్క్ కాస్తా కేవలం వాకింగ్ ట్రాక్ లాగా మారిపోతుం దని అంటున్నారు.

దీనిపై హైకోర్టులో కేసు లు కూడా వేశారు. అయితే, జీహెచ్‌ఎంసీ మాత్రం ఈ ప్రాజెక్టు కోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఇప్పటికే అనుమతులు తెచ్చుకుంది. చెట్లకు పెద్దగా నష్టం జరగకుం డానే, జాగ్రత్తగా పనులు చేస్తామని చెపుతోం ది. మరోవైపు ఈ ప్రాజెక్టు కోసం రోడ్డు పక్కన ఉన్న 307 ఇళ్లు, దుకాణాల స్థలాల ను సేకరించాల్సి ఉంది. ఇన్ని సవాళ్లు ఉన్న ప్పటికీ, సిటీ ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి ఈ ప్రాజెక్టు చాలా అవసరమని చెబుతూ జీహెచ్‌ఎంసీ పనులు వేగవంతం చేసింది.

మిగతా పనుల మాటేంటి?

జీహెచ్‌ఎంసీ హెచ్-సిటీ ప్రాజెక్టు కింద కేవలం కేబీఆర్ పార్క్ పనులే కాదు, నగరవ్యాప్తంగా దాదాపు రూ.7 వేల కోట్లతో 38 భారీ ప్రాజెక్టులను ప్రతిపాదించింది. కానీ, అవన్నీ ఇంకా కాగితాల మీదే ఉన్నా యి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు రోజూ నరకం చూసే ఖాజాగూడ జంక్షన్, ట్రిపుల్ ఐటీ జంక్షన్, విప్రో జంక్షన్, ఆల్విన్ ఎక్స్రోడ్స్ దగ్గర నిర్మించాల్సిన ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల పనులు ఇంకా మొదలుకాలేదు.

శేరిలింగం పల్లిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి , కుత్బుల్లాపూర్ ఫాక్స్ సాగర్ నాలాపై ఫ్లైఓవర్ పనులు కూడా అటకెక్కాయి. పాతబస్తీలో చాంద్రా యణగుట్ట నుంచి బార్కస్ వరకు, తులసీ నగర్  గౌస్ నగర్ మార్గాల్లో రోడ్ల విస్తరణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి.