పూల ప్రవర్తన
02-03-2026 01:52 AM
ఎండాకాలం వస్తుందంటే
ఎప్పటిలా మనం హడలిపోతాం
ఆ మల్లెల్ని చూడండి
అనాదిగా వేసవి నాటి సాయంత్రాలకు
అందాన్ని సుగంధాలను అద్దుతూనేఉన్నాయి
రోజంతా వడగాడ్పులతో
వడలిపోయే లోకానికి
మలిసంధ్యలో పూల పరిమళమే
సేద తీర్చే దివ్యౌషధం
కాలమెంతగా మారినా
మల్లెపూల గౌరవానికి
ఏనాడు ఒకింత భంగం వాటిల్ల లేదు
మనలా శాశ్వతత్వాన్ని ఆశించని
పూల లోకానికి దుఃఖమెప్పుడూ దూరమే
నేల రాలేక కూడా పూలు
మట్టితో మమేకమై
బలాన్ని జీవాన్ని దానం చేస్తాయి
పూలు మనలా
విశ్వగురుత్వాన్ని ఆశించవు
పరిమళ భరిత ప్రవర్తనతోనే
ఏడేడు లోకాలను నిద్రలేపుతాయి!!
కోట్ల వెంకటేశ్వరరెడ్డి




