పోక్సో కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు
సిరిసిల్ల, ఆగస్టు 24, (విజయ క్రాంతి): మైనర్ బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పోక్సో కేసులో నిందితుడు జంగ్లి రఘుకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ సోమవారం తీర్పు వెల్లడించారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. సిరిసిల్ల పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ డ్యాన్స్ అకాడమీలో డ్యాన్స్ మాస్టర్ జంగ్లి రఘు మైనర్ బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో అప్పటి సీఐ ఉపేందర్ కేసు నమోదు చేశారు.
దర్యాప్తు అనంతరం చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టు విచారణలో పోలీసులు 8 మంది సాక్షులను ప్రవేశపెట్టగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. జాన్సీ వాదించారు. ఆధారాలు, సాక్షులను పరిశీలించిన న్యాయస్థానం నేరం రుజువైనట్లు నిర్ధారించి శిక్ష విధించింది.నేరాలకు పాల్పడిన వారు ఎవరైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని ఎస్పీ మహేష్ బి. గితే అన్నారు. పోలీసు, ప్రాసిక్యూషన్ సమన్వయంతో నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.కేసు దర్యాప్తులో, నిందితుడికి శిక్ష పడటంలో కృషి చేసిన పోలీసు అధికారులను అభినందిచారు.






