డిగ్రీ ప్రవేశాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానం
ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్
ముకరంపుర,(విజయక్రాంతి): దోస్త్-2026 డిగ్రీ ప్రవేశాల్లో స్థానిక ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కరీంనగర్ రాష్ట్రవ్యాప్తంగా 1,561 అడ్మిషన్లతో ప్రథమ స్థానం సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల అడ్మిషన్స్ కమిటీ కోఆర్డినేటర్ మరియు కళాశాల విద్యా జేఏసీ చైర్మన్ డాక్టర్ కడారు సురేందర్ రెడ్డి, దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్.రామకృష్ణలతో కలిసి విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఆయన హర్షం వ్యక్తం చేశారు. దోస్త్ మూడు విడతల కౌన్సెలింగ్ ద్వారా కళాశాలలో మొత్తం 1,561 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందినట్లు తెలిపారు. ఇంకా పరిమిత సంఖ్యలో సీట్లు ఖాళీగా ఉన్నాయని, వాటిని దోస్త్ స్పెషల్ ఫేజ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా, ఇప్పటికే అడ్మిషన్ పొందిన విద్యార్థులు కళాశాల స్థాయిలో తమ కోర్సులను మార్చుకునేందుకు దోస్త్ ఇంట్రా-కాలేజ్ ఫేజ్ షెడ్యూల్ విడుదలైనట్లు తెలిపారు. ఈ మేరకు జూలై 10 నుంచి 13వ తేదీ వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్ల ద్వారా కోర్సుల మార్పు కోసం తమ ఎంపికలను నమోదు చేసుకోవచ్చని, జూలై 14న అలాట్‌మెంట్ విడుదల కానుందని వివరించారు.అడ్మిషన్లలో రాష్ట్ర స్థాయిలో కళాశాల ప్రథమ స్థానం సాధించడం పట్ల కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ పి. నితిన్, టి. రాజయ్య, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ప్రిన్సిపాల్‌ను అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.






