17-02-2026 02:12:20 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని నర్సరీ వెనుక భాగంలో ఉన్న చెట్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పక్కనే నర్సరీ ఉండటంతో పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నప్పటికీ, సకాలంలో స్పందించడంతో భారీ నష్టం తప్పింది. ఈ ఘటనలో కొన్ని చెట్లు మాత్రమే కాలి బూడిదయ్యాయి. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు సంఘటనపై దర్యాప్తు చేపట్టారు.