12 August, 2026 | 9:52 PM

గుంతలమయమైన రహదారికి నాయకుల చొరవ

12-08-2026 08:05 PM

* వర్షాలతో దెబ్బతిన్న రహదారిపై తాత్కాలిక మరమ్మతులు 

* మట్టి పోసి గుంతలను పూడ్చివేసిన ప్రజాప్రతినిధులు

పాపన్నపేట: ఇటీవల కురిసిన వర్షాలకు మెదక్–పాపన్నపేట ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. ముఖ్యంగా కొత్తపల్లి శివారులోని బ్రిడ్జి వద్ద రహదారిపై పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడి వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతల్లో వర్షపు నీరు నిలిచి రాకపోకలకు ఆటంకం కలగడంతో పాటు ప్రమాదాలు జరిగే పరిస్థితి నెలకొంది. సమస్యను గుర్తించిన యూసుఫ్‌పేట్ గ్రామ సర్పంచ్ అనిత నరేందర్‌రెడ్డి, ఆరేపల్లి సర్పంచ్ రజిత రాజశేఖర్ లు కలిసి కొత్తపల్లి బ్రిడ్జి వద్ద ఏర్పడిన గుంతలను మట్టితో పూడ్చివేయించే పనులు చేపట్టారు. రహదారిపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా తాత్కాలికంగా గుంతలను పూడ్చి సరిచేశారు. ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతల కారణంగా నిత్యం రాకపోకలు సాగించే వాహనదారులుఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గ్రామ ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

శాశ్వత పరిష్కారం చూపాలి

ప్రస్తుతం చేపట్టిన మట్టి పూడ్చివేతతో తాత్కాలికంగా ఇబ్బందులు తగ్గినా, భారీ వర్షాలు కురిస్తే గుంతలు మళ్లీ ఏర్పడే అవకాశం ఉందని వాహనదారులు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కొత్తపల్లి బ్రిడ్జి వద్ద రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని వారు కోరుతున్నారు.