25 August, 2026 | 2:35 PM

రాష్ట్రపతి అవార్డు గ్రహీతకు సన్మానం

25-08-2026 01:51 AM

యువ శాస్త్రవేత్త దీపక్ రెడ్డిని అభినందించిన డిప్యూటీ కలెక్టర్  

బీడు భూముల్లో రాళ్లు ఏరే యంత్రం ఆవిష్కరణ

నారాయణఖేడ్, ఆగస్టు 24: మండల పరిధిలోని బోరంచ గ్రామానికి చెందిన దీపక్ రెడ్డిని డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్ సోమవారం మానూర్ తహశీల్ కార్యాలయంలో అభినందించి ప్రత్యేక సన్మానం చేశారు. బీడు భూముల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించేందుకు గాను ప్రత్యేకంగా రాళ్లు ఏరే యంత్రాన్ని దీపక్ రెడ్డి కనుగొని దాన్ని ఆవిష్కరించారు. దీంతో  దీపక్ రెడ్డికి భారత రాష్ట్రపతి ఆయనకు ప్రత్యేక అవార్డును అందజేసి అభినందించారు. 

ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ ప్రతిభా శేఖర్ మాట్లాడుతూ వ్యవసాయ పొలం గట్లు లో రాళ్లు ఉండడం రైతుల ఇబ్బందులను గుర్తించి రాళ్ళను ఏరే యంత్రాన్ని తయారు చేయడం అభినందనీయమన్నారు. రైతులు పడే కష్టాలను గుర్తించి యంత్రాన్ని కనుకోవడం గొప్ప విషయం అన్నారు.

ఇకముందు కూడా రైతుల అవసరాలను గుర్తించి ఆధునిక పనిముట్లు తయారు చేయాలని ఆమె యువ శాస్త్రవేత్తను దీపక్ రెడ్డిని ప్రోత్సహించారు. కార్యక్రమంలో మనూరు తహసీల్దార్ విష్ణు సాగర్, డిప్యూటీ తహసీల్దార్ ఆదర్శ్ కుమార్, ఆర్‌ఐ శంకర్ రెడ్డి, ఖాజామోనుద్దీన్, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు బోజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.