25 August, 2026 | 9:44 PM

ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల అడుగులు

25-08-2026 07:21 PM

ఈ సీజన్లో 1700 ఎకరాల్లో ఆయిల్ పామ్, కూరగాయలు, పూల మొక్కల సాగు

సత్పలితాలు ఇస్తున్న అవగాహన కార్యక్రమాలు

క్షేత్రస్థాయిలో ప్రతి వారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలన

ఉత్తమ రైతులకు అభినందనలు

గంభీరావుపేట,(విజయక్రాంతి): ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతుల అడుగులు వేస్తున్నారు. దీర్ఘకాలికంగా ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్, అలాగే కూరగాయలు, పూల తోటల సాగు చేస్తున్నారు. కాలానికి అనుగుణంగా పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రత్యేక దృష్టి.. పక్కా కార్యాచరణ సత్పలితాలు ఇస్తున్నాయి. ప్రతి వారం జిల్లా కలెక్టర్ ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్న రైతులను నేరుగా కలిసి సాగు విధానాలు, పంట దిగుబడి, ఆదాయం తదితర వివరాలు సేకరిస్తూ.. ప్రభుత్వ సబ్సిడీలు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నారు.

విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రణాళిక ప్రకారం జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో రైతు వేదికలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో, క్షేత్రస్థాయి ప్రదర్శనలు నిర్వహించారు. ఆయిల్ పామ్, కూరగాయలు, పూల మొక్కల సాగుతో లాభాలను వివరిస్తూ జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు, యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ.. కరపత్రాలు రైతులకు పంచి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఉద్యానవన, వ్యవసాయ శాఖ, సహకార శాఖ అధికారులతో నిర్వహించారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 420 ఎకరాల్లో రైతులు వరి సాగు నుంచి ఆయిల్ పామ్ సాగులోకి మారారు.

1250 ఎకరాల్లో కూరగాయల సాగు

ఎల్ నినో ప్రభావం, ఇబ్బందులు అధిగమించేందుకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి ఆదాయం పొందాలనే ఉద్దేశం జిల్లాలోని రైతులు దాదాపు 1250 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు, 35 ఎకరాల్లో వివిధ రకాల పూల మొక్కలు సాగు చేస్తున్నారు. ఆయా పంటల సాగుతో రైతులకు నిరంతర ఆదాయం సమకూరుతున్నది.సంప్రదాయ వరిసాగుకు స్వస్తి పలికి 25 నుంచి ముప్పై ఏండ్ల పాటు ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్ తోటల సాగు వైపు రైతులు మారారు.

ఈ సీజన్లో జిల్లాలో ఇప్పటివరకు 162 మంది రైతులు 420 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేశారు. మొదటి మూడు ఏండ్లపాటు అంతర పంటలు సాగు చేసి ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం ఆయిల్ పామ్ ఒక టన్నుకు రూ. 23 వేలపైగా ధర ఉంది. జిల్లాలో సంప్రదాయ వరి సాగుకు స్వస్తి పలుకుతూ.. మిగితా పంటలు సాగు చేస్తున్న ఆదర్శ రైతులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రతి మంగళవారం క్షేత్రస్థాయిలో కలిసి .. సాగు విధానాలు, దిగుబడి, లాభాలు తదితర అంశాలు తెలుసుకొని.. అభినందిస్తున్నారు.

రెండు ఎకరాల్లో బంతి పూల సాగు

గంభీరావుపేట మండలం గజ సింగవరంలో రైతు బోయిని మల్లేశం తనకు ఉన్న మూడున్నర ఎకరాల నుంచి రెండు ఎకరాలలో జూలైలో బంతి పూల సాగు చేపట్టారు. ఈ పంట నాటిన 60-65 రోజుల నుంచి సెప్టెంబర్ నుండి ప్రారంభమై డిసెంబర్ వరకు కొనసాగుతుంది. ప్రతి 2-3 రోజుల వ్యవధిలో పూల కోత చేయవచ్చు, ఇది 60-75 రోజుల పాటు కొనసాగుతుంది. ఎకరానికి సుమారు 45-50 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.

రెండు ఎకరాల సాగుకు గాను రైతు రూ. 50 వేల నుంచి రూ. 60వేల వరకు ఖర్చు చేశారు. ఇందులో ఉద్యాన శాఖ ద్వారా విత్తనాలు, ఎరువులకు కలిపి 50% రాయితీ లేదా ఎకరానికి రూ. 8వేల చొప్పున గరిష్టంగా ఐదు ఎకరాల వరకు రాయితీ అందనుంది. రైతుకు సగటున ఒక్కో కిలో బంతి పూలకు రూ. 60/- ధర లభిస్తుంది. దసరా, దీపావళి, శుభకార్యాలు, అయ్యప్ప పూజా కార్యక్రమాలతో ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే ఉంది.

జిల్లా కలెక్టర్ అభినందన..

గజ సింగవరంలో రైతు బోయిని మల్లేశం వరి సాగును వదిలి బంతి పూల సాగు చేస్తుండగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు? పంట ఎన్ని రోజుల్లో చేతికి వస్తుంది? ఎంత ఆదాయం వస్తుంది? అనే వివరాలను రైతు మల్లేశంను అడిగి తెలుసుకున్నారు. అతడిని శాలువాతో సన్మానించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వరి పంటకు ప్రత్యామ్నాయంగా బంతి పూల సాగు చేయడం అభినందనీయమని కొనియాడారు.

మిగితా రైతులు ఆదర్శంగా తీసుకొని తమకు ఉన్న భూమిలో ఆరుతడి పంటలు, కూరగాయలు సాగు చేసి ఆదాయం పొందాలని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని పిలుపు నిచ్చారు. ఉద్యానవన శాఖ, ఇతర శాఖల నుంచి వచ్చే ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. పరిశీలనలో సర్పంచ్ ఉమ్మారెడ్డి విమల, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, ఎంపీడీఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.