29 August, 2026 | 11:33 PM

పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

29-08-2026 10:14 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): విద్యార్థులు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండేందుకు పోషకాలతో కూడిన పౌష్టికాహారం తీసుకోవడం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పోషకాహార లోపం నివారణకు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తోందని తెలిపారు. శనివారం భుక్తాపూర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఆరోగ్య పాఠశాల కార్యక్రమంతో పాటు వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కంటి అద్దాల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు పాఠశాలలో అందించే మధ్యాహ్న భోజనాన్ని నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు తదితర పోషకాహారాన్ని తమ ఆహారంలో భాగంగా చేసుకోవాలని అన్నారు. శరీర సాధారణ పనితీరు మెరుగ్గా ఉండేందుకు ప్రతిరోజూ తగినంత నీరు తాగడం కూడా చాలా అవసరమని తెలిపారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పరిమితంగా ఉపయోగించాలని కలెక్టర్ సూచించారు.

చిన్న వయస్సులోనే మొబైల్ ఫోన్లు, టీవీలకు అధికంగా అలవాటు పడటం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. అధిక స్క్రీన్ టైమ్ వల్ల పిల్లల నిద్ర, ఏకాగ్రత, శారీరక చురుకుదనం వంటి అంశాలపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందని, విద్యార్థులు చదువు, క్రీడలు, పుస్తక పఠనం వంటి ఆరోగ్యకరమైన కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కంటి సమస్యలు ఉన్న విద్యార్థులు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా కంటి అద్దాలు ధరించాలని కలెక్టర్ సూచించారు.

కంటి చూపు సంబంధిత సమస్యలను తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్స, వైద్యుల సూచనలు పాటించడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల సంక్షేమం, భద్రతకు సంబంధించిన సమస్యలను తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్సులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తమకు ఎదురయ్యే సమస్యలను ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. ప్రస్తుత పాఠశాల భవనం పురాతనంగా మారినందున నూతన భవన నిర్మాణానికి సుమారు రూ.4 నుంచి రూ.5 కోట్ల వరకు వ్యయం అయ్యే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.

నూతన భవన నిర్మాణం పూర్తయ్యే వరకు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పాఠశాలను తాత్కాలికంగా డీసీఈబీ కార్యాలయ భవనంలోకి తరలిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు. అంతకుముందు ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, కంటి సంరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ మాధవి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాధన, స్థానిక కౌన్సిలర్ ప్రకాష్, వైద్యులు శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు రమేష్ రెడ్డి, డీబీసీఓ కృష్ణ, ఆర్బీఎస్‌కే వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.