21 July, 2026 | 9:04 PM

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వరి సాగుకు దూరంగా ఉండాలి

21-07-2026 02:13 AM
  1. ప్రత్యామ్నాయ ఉద్యాన పంటల సాగుతో అధిక ఆదాయం పొందండి
  2. జిల్లా ఉద్యాన & పట్టు పరిశ్రమల అధికారి గడ్డం శ్యాంప్రసాద్

పెద్దపల్లి, జూలై 20(విజయ క్రాంతి)ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున పెద్దపల్లి జిల్లా రైతులు పంటల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఉద్యాన & పట్టు పరిశ్రమల అధికారి గడ్డం శ్యాంప్రసాద్ సూచించారు. భూగర్భ జలాలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో వరి వంటి అధిక నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ ఉద్యాన పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.వాతావరణ మార్పులను తట్టుకునే పంటల్లో ఆయిల్ పామ్ ఉత్తమ ప్రత్యామ్నాయమని పేర్కొన్న ఆయన, దీని ద్వారా దీర్ఘకాలిక స్థిర ఆదాయంతో పాటు నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించవచ్చన్నారు.

ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటలుగా కూరగాయలు, పప్పుధాన్యాలు సాగు చేయడం ద్వారా ప్రారంభ సంవత్సరాల్లోనే అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.స్వల్పకాలిక పంటలైన బెండ, అలసంద, మిరప, టమాట, చిక్కుడు, మునగ వంటి కూరగాయల సాగును ప్రోత్సహించాలని సూచించిన ఆయన, అరటి, బొప్పాయి, సొరకాయ, బీరకాయ, కాకరకాయ, పొట్లకాయ వంటి అధిక నీటి అవసరమయ్యే పంటలను ఈ సీజన్లో వీలైనంత వరకు సాగు చేయవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు.ప్రతి రైతు డ్రిప్, స్ప్రింక్లర్ నీటిపారుదల విధానాలు, మల్చింగ్ పద్ధతులను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు.

వీటి ద్వారా 40 నుంచి 60 శాతం వరకు నీటిని ఆదా చేయడంతో పాటు పంట దిగుబడి, నాణ్యత పెరుగుతుందని తెలిపారు.వర్షపు నీటిని సంరక్షించేందుకు వ్యవసాయ క్షేత్రాల్లో ఫార్మ్ పాండ్లు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, పంట పొలాల చుట్టూ అధిక ఎత్తులో పెరిగే చెట్లను నియంత్రించడం ద్వారా పంటలకు తగిన సూర్యరశ్మి, గాలి అందుతాయని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా ఆయిల్ పామ్, కూరగాయలు, పూల పంటలు, పసుపు సాగుతో పాటు డ్రిప్, స్ప్రింక్లర్, మల్చింగ్ పథకాలపై సబ్సిడీలు అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఈ సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకొని నీటి సంరక్షణ చర్యలు పాటిస్తూ ఎల్ నినో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొని అధిక ఆదాయం పొందాలని జిల్లా ఉద్యాన అధికారి శ్యాంప్రసాద్ కోరారు.