కామారెడ్డి జిల్లాలో రైతు దారుణ హత్య
భూ వివాదమేనా హత్యకు దారి తీసిందా..?
పోలీసుల అదుపులో హత్య చేసిన నిందితులు
లింగాపూర్ లో టెన్షన్.. టెన్షన్
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్ర శివారులోని లింగాపూర్ లో ఓ రైతు దారుణ హత్యకు గురయ్యారు. లింగాపూర్ గ్రామానికి చెందిన బండారి రాజిరెడ్డి (56) నీ అదే కాలనీలో నివాసం ఉంటు న్న మంచాల ఎల్లయ్య అతని కుమారుడు కలిసి హత్య చేసినట్లు తెలుస్తుంది. బండారి రాజిరెడ్డి ఈనెల 29న రాత్రి 7 గంటల ప్రాంతంలో మంచాల ఎల్లయ్య అనే వ్యక్తి ఇంటి దగ్గర కనిపించినట్లు స్థానికులు తెలిపారు. అప్పటినుంచి రాజిరెడ్డి కనిపించ కుండ పోయారు.
అప్పటినుండి రాజిరెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై రాజిరెడ్డి ఆచూకీ కోసం వెతక సాగారు. అదే కాలనీ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో రాజిరెడ్డికి చెందిన ద్విచక్ర వాహనం, సెల్ఫోన్ లు కనిపించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు దేవుని పల్లి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న దేవునిపల్లి పోలీసులు ద్విచక్ర వాహనాన్ని, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. లభించిన సెల్ఫోన్ ఆధారంగా పోలీసులు విచారణను ప్రారంభించారు.
పోలీసుల విచారణలో మంచాల ఎల్లయ్య అతని కొడుకు ప్రణీత్ కలిసి రాజిరెడ్డిని హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానితులను ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించగా రాజిరెడ్డిని హత్య చేసి బావిలో పూడ్చి పెట్టినట్లు అంగీకరించారు. శనివారం అర్ధరాత్రి 11:30 గంటలకు ప్రాంతంలో అనుమానితు లు పూడ్చి పెట్టిన రాజిరెడ్డి మృత దేహాన్ని పోలీసులు బయటకు తీశారు. రాజిరెడ్డి, ఎల్లయ్య లు కలిసి భూమి కొనుగోలు చేశారని ఆ భూవివాదమే హత్యకు దారి తీసినట్లు తెలుస్తుంది. సంఘటన స్థలాన్ని కామారెడ్డి డి.ఎస్.పి మధుసూదన్, సంఘటన స్థలంలో నే ఉండి విచారణను పర్యవేక్షించారు. లింగాపూర్ లో బండారి రాజిరెడ్డి హత్యకు గురి కావడం కలకలం రేపుతుంది. ప్రస్తుతం నిందితులిద్దరు పోలీసుల అదుపులో ఉన్నారు.






