25 April, 2026 | 9:07 PM

ప్రమాదవశాత్తు చెరువులో పడి రైతు మృతి

25-04-2026 07:34 PM

ప్రభుత్వం ఆదుకోవాలన్న మాజీ మంత్రి రామన్న

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ రైతు మృతి చెందిన విషాద ఘటన ఆదిలాబాద్ రూరల్ మండలం జందాపూర్ లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన సొప్పరి సాయి అనే రైతు ఎడ్లబండితో చెరువు దాటుతుండగా, బండి మట్టిలో ఇరుక్కుపోయింది. దానిని బయటకు తీసే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి రైతు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కాగా రైతు మరణించిన విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి జోగు రామన్న రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు.

మృతికి గల కారణాన్ని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. రైతు ప్రమాదంలో మృతి చెందడం అత్యంత బాధాకరమైన విషయం అని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.  ఈ ఘటన గ్రామాన్ని తీవ్ర విషాదంలో ముంచిందని, కుటుంబ సభ్యులకు ఇది తీరని లోటని పేర్కొన్నారు. యువ రైతు మరణం పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మృతుని కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించడంతో పాటు, బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.