21 July, 2026 | 9:27 PM

సులానగర్ పీహెచ్‌సీలో బదిలీ ఉద్యోగులకు ఘన వీడ్కోలు

21-07-2026 06:37 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్తున్న ఆరోగ్య శాఖ ఉద్యోగులకు మంగళవారం ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరై ఆరోగ్య విస్తరణాధికారి దేవా, సూపర్వైజర్లు ఫోరండ్ల శ్రీనివాస్, నాగుబండి వెంకటేశ్వర్లు, ల్యాబ్ టెక్నీషియన్ రాజు, ఏఎన్‌ఎంలు లలిత, ఎల్లమ్మ, నాగలక్ష్మి, రమాకుమారి, సుజాత, మానసతో పాటు బదిలీపై వెళ్తున్న ఆరోగ్య శాఖ సిబ్బందిని శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ తుకారం రాథోడ్ మాట్లాడుతూ.. సులానగర్ పీహెచ్‌సీలో ఉద్యోగులు అందించిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. కొత్త బాధ్యతల్లోనూ ఇదే అంకితభావంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. సహోద్యోగులు బదిలీపై వెళ్తున్న ఉద్యోగుల సేవలను గుర్తు చేసుకుంటూ అభినందనలు తెలిపారు. స్పందించిన ఉద్యోగులు సులానగర్‌లో పనిచేసిన రోజులు తమకు చిరస్మరణీయమని, సహచరుల సహకారాన్ని ఎప్పటికీ మరువబోమని పేర్కొన్నారు.