తెల్లబోయిన జింకల సైన్ బోర్డులు!
జింకల సంరక్షణపై అటవీశాఖ నిర్లక్ష్యం
నాగల్‌గిద్ద, ఆగస్టు 20 : నాగల్‌గిద్ద మండలంలోని జింకల సంరక్షణపై అటవీశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. మండలంలోని మంజీరా పరివాహక ప్రాంతంలో జింకలు పెద్ద సంఖ్యలో సంచరిస్తున్నప్పటికీ వాటి రక్షణకు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు ప్రస్తుతం పూర్తిగా రంగు వెలిసి తెల్లబోర్డులుగా మారిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బోర్డులపై ఉన్న జింకల చిత్రాలు, హెచ్చరికలు కనిపించకపోవడంతో వాటి ఉద్దేశమే నెరవేరడం లేదని అంటున్నారు. షికార్ఖానా, గౌడగం, కారాముంగి, కరస్గుత్తి, గొందేగాం తదితర ప్రాంతాల్లో జింకలు రహదారులు దాటుతూ సంచరిస్తుంటాయని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో జింకలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో జింకలు మృతి చెందిన ఘటనలపై అనుమానాలు వ్యక్తమైనప్పటికీ వాటి సంరక్షణకు శాశ్వత చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. జింకలు సంచరించే ప్రాంతాల్లో కొత్త హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, రాత్రివేళల్లో ప్రత్యేక గస్తీ నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
జింకల సంచార ప్రాంతాలను గుర్తించి వేగ నియంత్రణ సూచికలు, రిఫ్లెక్టివ్ బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అలాగే జింకలకు తాగునీరు, మేత అందుబాటులో ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి జింకల సంరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.






