25 August, 2026 | 7:57 PM

నేత్రదానం చేసి అంధుల జీవితాల్లో వెలుగు నింపండి

25-08-2026 06:49 PM

అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి

భూపాలపల్లి,(విజయక్రాంతి): మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా  అంధులకు చూపునిచ్చి వారి జీవితాల్లో వెలుగు నింపవచ్చని అదనపు కలెక్టర్ ఎల్. విజయలక్ష్మి అన్నారు. 41వ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ దేవేందర్ ఆధ్వర్యంలో నేత్రదాన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నేత్రదానం కుటుంబ సంప్రదాయంగా మారాలని, నర్సింగ్ విద్యార్థులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరత్నం మాట్లాడుతూ పక్షోత్సవాల సందర్భంగా జనరల్ ఆసుపత్రిలో ప్రత్యేక కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన నేత్రదాన అవగాహన ర్యాలీని అదనపు కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ సందీప్, డాక్టర్ రాహుల్, ఆప్తాలమిక్ అధికారి బూరుగు రవికుమార్, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.