‘బోనాల’ సంబరం.. ముత్యాలమ్మ జాతరకు సర్వం సిద్ధం
కేసముద్రం, (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో ఆదివారం కనివిని ఎరగని రీతిలో బోనాల పండుగ నిర్వహించడానికి మున్సిపల్ చైర్‌పర్సన్ బానోత్ సునీత వెంకన్న, వైస్ చైర్‌పర్సన్ అల్లం రమ నాగేశ్వరరావుల ఆధ్వర్యంలో ఘన ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సాంస్కృతిక కళాకారుల ఆటపాటలు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ పిలుపునిచ్చారు. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ఈ ఏడాది బోనాల జాతరను చరిత్రలో నిలిచిపోయేలా, అత్యంత వైభవంగా నిర్వహించేందుకు మున్సిపాలిటీ సర్వం సిద్ధం చేసింది.
ఆదివారం రోజున శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి బోనాల జాతర కన్నుల పండుగగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ పల్లె సంస్కృతి ఉట్టిపడే విధంగా ప్రముఖ సాంస్కృతిక కళాకారుల నృత్యాలు, పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్ళు, ఒగ్గుడోలు, మహిళా కోలాటం, బోనాల కోలాటం, మహిళా డబ్బులు, చిందు యక్షగానం తదితర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
నూతనంగా ఏర్పడ్డ కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో తొలిసారి నిర్వహిస్తున్న ముత్యాలమ్మ బోనాల పండుగ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగా సుందరంగా ముస్తాబు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు, ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాగునీరు, నీడ, మెరుగైన రవాణా సౌకర్యం కల్పించారు. మున్సిపాలిటీ పరిధిలోని భక్తజనులు, మహిళలు అందరూ సాంప్రదాయ దుస్తులతో, మంగళకరమైన బోనాలతో భక్తిశ్రద్ధలతో తరలివచ్చి, ముత్యాలమ్మ బోనాల జాతరను జయప్రదం చేయాలని, ఆ చల్లని తల్లి ముత్యాలమ్మ ఆశీస్సులు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు చైర్పర్సన్, వైస్ చైర్ పర్సన్ తెలిపారు.






