21 March, 2026 | 9:52 AM

అందరికీ అన్నీ.. రాష్ట్ర బడ్జెట్ 2026-27

21-03-2026 01:27 AM

ప్రజల పద్దు

మొత్తం బడ్జెట్: రూ.3,24,234 కోట్లు

రెవెన్యూ వ్యయం: రూ.2,34,406 కోట్లు 

మూలధన వ్యయం: రూ.47,267 కోట్లు

పదేళ్ల విధ్వంసాన్ని సరిదిద్దే పునాది ఈ బడ్జెట్

  1. అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట
  2. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి భరోసా 
  3. దేశానికే గ్రోత్ ఇంజిన్‌గా తెలంగాణ
  4. గత ప్రభుత్వంలో ఆయా శాఖల నిధులు దారిమళ్లింపు
  5. ఖర్చుకాని సబ్ ప్లాన్ నిధులు రూ. 14 వేల కోట్లు
  6. బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

* పదేళ్ల విధ్వంసాన్ని సరిదిద్దే పునాది ఈ బడ్జెట్..  ప్రశాంతమైన తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించే బ్లూ ప్రింట్. కొత్త సంపదను సృష్టించి దానిని ప్రజలకు పంచడమే మా ప్రజా ప్రభుత్వ ఆర్థిక విధానం. గొప్పల  కోసం మేం అబద్ధాలు చెప్పబోం, ఈ ప్రభుత్వం వాస్తవాల పునాదుల మీద పని చేస్తుంది. గత ప్రభుత్వం కేంద్రం నుంచి మంజూరైన నిధులను ఆయా పథకాల అమలుకు ఖర్చుచేయకుండా, ఇతర అవసరాలకు నిధులు దారి మళ్లించడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన తదుపరి వాయిదాలు నిలిచిపోయాయి.. తద్వార తెలంగాణకు తీరని నష్టం జరిగింది.       

డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క


ముఖ్యాంశాలు..

* 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షలతో జీవిత బీమా.. 

* ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి రూ.4 వేల కోట్లు జూన్ 2 నుంచి అమలు

* ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు అల్పాహారం

* ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత ఆరోగ్య భద్రత పథకం. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డు

* ఐటీఐ, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2 వేల ఉపకారవేతనం


హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి) : పేదవాడి కన్నీరు తుడిచిన నాడే నిజమైన అభివృద్ధి అన్న మహా త్మాగాంధీ మాటలను, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, ఈ రెండేళ్ల మా పాలన, పదేళ్ల విధ్వంసాన్ని సరిదిద్దే పునాది ఈ బడ్జెట్ అని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆ పునాదిపై ఒక సుం దరమైన, సుసంపన్నమైన, ప్రశాంతమైన తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించే బ్లూ ప్రింట్ అన్నారు.

శుక్రవారం అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టా రు. ఈ ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం రూ.3,24,234 కోట్లు, రెవె న్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు, మూలధన వ్యయం రూ.47,267 కోట్లుగా ప్రతిపాదిస్తున్నట్టు వెల్లడించా రు. బడ్జెట్ అంటే కేవలం సంఖ్యలు.. అక్షరాలు మాత్రమే కాదు. మన జీవి తం. మన భవిష్యత్తు అన్నారు.

కలలు కనే యువతకు భవిష్యత్తుపై ఆశ కల్పించడం, ఆసరా కోసం చూసే బలహీను లను ఆదుకోవడం, నీడలేని వారికి నీడకల్పించడం, పంటపొలాలకు నీళ్లు పారించడం ఫలసాయం పెంచడం, కష్టపడే వారికి పని కల్పించడం, ఇష్టపడేలా పాలన అందించడం.. ఒక్క మాటలో చెప్పాలంటే నేను ప్రతిపాదిస్తున్న ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశా దీపమని చెప్పారు. అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేసి ఆర్భాటాలకు పోకుండా ఆర్థిక క్రమశిక్షణకు ప్రా ధాన్యతనిస్తున్నామని తెలిపారు.

ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల ప్రతిరూపమని, పీడిత, తాడిత, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి ఇస్తున్న భరోసా అని స్పష్టం చేశారు. ఒకవైపు ఆర్థికపరమైన ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఏమాత్రం నిధుల కొరత రాకుండా ఈ బడ్జెట్‌ను సమతుల్యంగా రూపొందించామని, పన్నుల భారంతో సామాన్యుడి పైన భారం మోపకుండా, ఉన్న వనరులను సద్వినియోగం చేస్తూ, కొత్త సంపదను సృష్టించి దానిని ప్రజలకు పంచడమే మా ప్రజా ప్రభుత్వ ఆర్థిక విధానమన్నారు. ప్రతిపక్షాలు కేవలం విమర్శలకే పరిమితం కాకుండా రాష్ట్రాభివృద్ధికి నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాలని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.

ప్రజల ప్రయోజనాలే పరమావధిగా, రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రజా ప్రభుత్వంలో... వరుసగా నాల్గవసారి 2026--27 ఆర్థిక సంవత్సరానికి బడ్జె ట్‌ను ప్రవేశపెట్టే అవకాశం కల్పించిన తెలంగాణ ప్రజానీకానికి, ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకత్వానికి కృత జ్ఞతలు తెలిపారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యమన్నారు. అంబేద్కర్ అడుగుజాడల్లోనే నడుస్తూ పాలన సాగిస్తున్నామని, మేము పాలకులం కాదు, ప్రజలకు సేవకుల మని తెలిపారు. 

గొప్పల కోసం అబద్ధాలు చెప్పం

గొప్పల  కోసం మేం అబద్ధాలు చెప్పబోమని, ఈ ప్రభుత్వం వాస్తవాల పునాదుల మీద పని చేస్తుందన్నారు. బాధ్యతతో ఎవరు ప్రశ్నించినా బాధ్యతతోనే వారికి సమాధానం చెబుతామని, అది ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల మాకున్న చిత్తశుద్ధి అన్నారు. ప్రజల సంకల్పం, ప్రభుత్వ దృఢ నిశ్చయంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పకడ్బందీగా పునాదులు వేస్తున్నామని, ఈ బడ్జెట్ లో రైతు సంక్షేమం, మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలతో కూడిన నాణ్యమైన విద్య,ఆరోగ్యం, విద్యార్థులకు పౌష్టికాహారం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, తెలంగాణను సుస్థిరమైన అభివృద్ధి వైపుకి నడిపించేదిగా రూపొందించామని తెలియజేశారు.

అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించామని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని రైతు శ్రామిక మహిళ రూపురేఖలతో స్థానిక సంప్రదాయాలు ఉట్టిపడేలా రూపొందించామని, తెలంగాణలో అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క -సారలమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించామని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగావకాశాలు మెరుగుపరచడం, పెట్టుబడులను ఆకర్షించడంపై మా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనపరిచిందన్నారు.

గ్లోబల్ సిటీల జాబితాలో హైదరాబాద్..

గత ప్రభుత్వం అధిక వడ్డీకి తెచ్చిన రూ.25,612 కోట్ల రుణాలను తక్కువ వడ్డీకి పునర్వ్యవస్థీకరించామని, రుణ చెల్లింపుల వ్యవధిని పెంచి, అసలు చెల్లించాల్సిన కాలాన్ని 20 నుంచి -39 సంవత్సరాలకు పొడిగించినట్టు పేర్కొన్నారు. ఈ రుణ పునర్ వ్యవస్థీకరణ ద్వారా 2025--26 నుండి 2031--32 దాకా చెల్లించాల్సినది రూ. 34,058 కోట్ల నుంచి రూ. 11,915 కోట్లకు తగ్గిందన్నారు. దీనిద్వారా, రాష్ట్రానికి 22 వేల 142 కోట్ల రూపాయలు క్యాష్ అవుట్ ఫ్లో తగ్గి నగదు వెసులుబాటు కలిగిందని పేర్కొన్నారు.

కేంద్రానికి పన్నుల రూపంలో మనం ఏటా వేల కోట్ల రూపాయల ఆదా యం సమకూరుస్తుంటే... తిరిగి కేంద్రం పన్నుల పంపకాల ద్వారా మనకు ఇస్తున్నది మనం కట్టే ప్రతి రూపాయిలో సగటున 42పైసలేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చారిత్రక లోపాన్ని సరిదిద్దేందుకు మన ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం ముందు బలమైన వాదనను వినిపించింది. దీని ద్వారా, తెలంగాణ వాటాను 2.102 శాతం నుండి 2.174 శాతానికి పెంచామని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా అతివేగంగా అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సిటీల జాబితాలో ఇప్పటి దాకా మనదేశంలో ఢిల్లీ, ముంబై వంటి పట్టణాలు మాత్రమే టాప్ టెన్ లిస్టులో ఉన్నాయని, ఇప్పుడు హైదరాబాద్ కూడా ఆ జాబితాలో చేరబోతున్నదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దార్శనిక నాయకత్వంలో తెలంగాణ మరో చారిత్రాత్మక అడుగు వేసి 30 వేల ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తుందన్నారు.

రేడియల్ రోడ్ల నిర్మాణం, ఫ్యూచర్ సిటీని నేరుగా ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం పోర్టుకు అనుసంధానించే గ్రీన్ఫీల్ జాతీయ రహదారి, భూగర్భ విద్యుత్ వ్యవస్థ, పర్యావరణ అనుకూల స్మార్ట్ గ్రిడ్లతో ఈ నగరం సుస్థిర అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తుంన్నారు. 

రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యత..

గత ప్రభుత్వం అట్టహాసంగా తెచ్చిన ధరణితో రైతులు అలవికాని కష్టాలను ఎదుర్కొన్నారని, ఈ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం తెలంగాణ భూ భారతి చట్టం-2025ను అమలు చేసిందని చెప్పారు. గ్రామ స్థాయిలోభూ పరిపాలనను బలోపేతం చేయడానికి 5,010 గ్రామ పాలనాధికారులతో సహా 8వేల 900 మంది సిబ్బందిని నియమించామని, అదనంగా 5,520 లైసెన్సుడ్ సర్వేయర్లు తమ సేవలను అందిస్తున్నారని తెలిపారు.

భూ భారతి చట్టం అమలులో భాగంగా రిజిస్ట్రేషన్, రెవిన్యూ, సర్వే సేవలను ఒకే వేదిక పైకి తీసుకురావడంతో రైతుల సమస్యలకు త్వరిత పరిష్కారం అందించే అవకాశం కలిగిందన్నారు. రాష్ట్రంలోని ఐకేపీ సంఘాల్లోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది మా ప్రభుత్వ సంకల్పమని, దీనిలో భాగంగా ఇప్పటికే 57 వేల 938 కోట్ల రూపాయల రుణం ఇప్పించామని వెల్లడించారు.

రైతులకు పెట్టుబడి సహాయం కోసం రైతు భరోసా పథకం ద్వారా ప్రతీ సీజన్‌కు ఎకరాకు 6,000 ల చొప్పున రెండు పంటలకు కలిపి సంవత్సరానికి 12,000 రూపాయలు సహాయం అందిస్తున్నామని చెప్పారు. అర్హులైన పేద కుటుంబాలకు 15.12 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీచేశామని, పాతకార్డుల్లో 19.44 లక్షల మంది కొత్త సభ్యులను చేర్చామన్నారు.

దేశానికే ఆదర్శంగా తెలంగాణ..

నాణ్యమైన, నైపుణ్యం కలిగిన విద్యను అందించాలనే సంకల్పంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల లను మంజూరు చేయాలని నిర్ణయించామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ విద్యార్థులు ఒకేచోట చదువుకునేందుకు వీలుగా అధునాతన వసతులతో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నామని, ఇప్పటికే 79 స్కూళ్ళు మంజూరు చేశామని, 44 చోట్ల నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయని పేర్కొన్నారు.

ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి 33 జిల్లాల్లో 1,362 ప్రీ-ప్రైమరీ విభాగాలను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించా మని, రాబోయే విద్యా సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని 2,000 నుండి 2,500 ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు వివరించారు.

విద్యార్థుల పోషణ, విద్యా ఫలితాలను మెరుగుపరచడానికి వీలుగా విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాలు ప్రవేశ పెడుతున్నామన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెయ్యి కోట్ల రూపాయలు, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి 400 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నామని, మిగిలిన విశ్వవిద్యాలయాలకు కూడా అవసరమైన నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. 

ఉద్యోగులకు ప్రమాద బీమా పథకం..

కొన్ని దశాబ్దాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్నటు వంటి నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని ప్రారంభిస్తున్నామని, ఈ పథకం ఉద్యోగస్తులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ వర్తిస్తుందన్నారు. ఇది ప్రభుత్వ ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు ఈ ప్రభుత్వం కల్పిస్తున్న భద్రత, భరోసా అని స్పష్టం చేశారు.

ఈ నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు చేస్తామని, ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 421 ఎంపానెల్ ప్రయివేట్ ఆసుపత్రులలో 1,998 వ్యాధులకు ఈ పథకం ద్వారా చికిత్సను పొందవచ్చు అని, ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డు అందిస్తామని, ఈ పథకం ద్వారా దాదాపు 23 లక్షల 51 వేల మందిప్రభుత్వ ఉద్యోగస్తులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులులబ్ధి పొందుతారని తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే 1 కోటి 20 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుంది, 60 ఏండ్ల వరకు 10 లక్షల రూపాయాల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, విమాన ప్రమాదంలో మరణిస్తే 2 కోట్ల రూపాయలు అదనపు కవరేజి లభించే విధంగా ఈ పథకాన్ని రూపకల్పన చేశామన్నారు. 7.57 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వర్తిస్తుందని తెలిపారు. 

ఆత్మగౌరవానికి చిహ్నంగా ఇందిరమ్మ ఇళ్లు..

రాష్ట్ర యువతకు సురక్షితమైన విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) ద్వారా యూఏఈ, జర్మనీ, జపాన్, యూకే, కెనడా వంటి 16 దేశాలలో సుమారు 13,930 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందని, ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా నూతనంగా సి.ఎం.ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాంను ప్రారంభిస్తున్నామని చెప్పారు.

3 నుండి 6 సంవత్సరాల వయస్సు గల చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35,781 అంగన్వాడీ కేంద్రాల ద్వారా ’ఆధార్ శిల’ పాఠ్యాంశాల ద్వారా సుమారు 4 లక్షల మంది చిన్నారులకు అత్యుత్తమ ప్రీ-ప్రైమరీ విద్యను ఉచితంగా అందించడంతో పాటు రెండు జతల యూనిఫాంలు అందిస్తున్నామన్నారు.

‘బాల భరోసా’ పథకం ద్వారా అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 ఏళ్ల లోపు వయసున్న చిన్నారుల్లో పుట్టుకతో వచ్చే శారీరక, మానసిక వైకల్యాలను లేదా ఎదుగుదలలో ఉండే లోపాలను తొలిదశలోనే గుర్తించడం ద్వారా, వారికి అవసరమైన వైద్య చికిత్సలు అందించి, భవిష్యత్తులో అవి శాశ్వత వైకల్యాలుగా మారకుండా నివారించి వారి తల్లిదండ్రులకు కొండంత ’భరోసా’ను ఇస్తోందని పేర్కొన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాలకు చెందిన యువతకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ‘రాజీవ్ యువ వికాసం పథకం’ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం అమలుకు 6 వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదించామని తెలిపారు.

సొంత స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక అందజేస్తుందన్నారు. 4 లక్షల 50 వేల ఇళ్లను మంజూరు చేసిందని తెలిపారు. ఈ పథకానికి 22 వేల 500 కోట్లు ఖర్చు అవుతుండగా, ఇప్పటి వరకు 5 వేల 73 కోట్ల 84 లక్షలు ఖర్చు చేశామన్నారు. ఈ బడ్జెట్లో గృహ నిర్మాణ శాఖకు 7,430 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నట్టు వెల్లడించారు. 

ఐటీ రంగంలో వృద్ధి..

తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగంలో వృద్ధిని పెంచడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి, ఉపాధి కల్పన కోసం 1వ, 2వ ఐసీటీ విధానాలను ప్రారంభించిందని, వీటితో పాటు ఎలక్ట్రానిక్స్ పాలసీ, ఇమేజ్ పాలసీ వంటి వాటిని కూడా ప్రభుత్వం తీసుకు వస్తుందన్నారు. తెలంగాణ పశ్చిమ ప్రాంతం, ముఖ్యంగా కొడంగల్ పరిసర ప్రాంతంలో రాబోయే సంవత్సరాల్లో ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందనుందని, దీనితో పాటు కొడంగల్ మల్టి పర్పస్ ఇండస్ట్రీయల్ పార్క్‌ని కూడా అభివృద్ధి చేస్తామన్నారు.

మన రాష్ట్రం నుంచి సరుకు ఎగుమతులు 1 లక్ష 61 వేల 843 కోట్ల రూపాయలకు చేరి, దేశంలో 7వ స్థానంలో ఉందని, ఇందులో ముఖ్యంగా ఏరోస్పేస్ మరియ డిఫెన్స్ రంగాలు కీలక పాత్ర పోషిస్తూ, మొత్తం ఎగుమతులలో దాదాపు 30 శాతం వాటాను కలిగి ఉన్నాయని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో తెలంగాణను కేంద్ర ప్రభుత్వం టాప్ అఛీవర్‌గా గుర్తించడం గర్వ కారణమన్నారు.

పంచాయతీ రోడ్లకు 12,702 గ్రామ పంచాయితీలకు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంతో 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం భారత ప్రభుత్వం 1,597 కోట్ల రూపాయలను విడుదల చేసిందన్నారు. మొదటి దశ కింద 96 నియోజక వర్గాల పరిధిలో 7,450 కి.మీ. గ్రామీణ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నామని, ఈ విధానం ప్రకారం 40 శాతం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించగా మిగిలిన 60 శాతాన్ని రాయితీదారు పెట్టుబడి పెడతారన్నారు.

గత ప్రభుత్వ తప్పిదాన్ని సరిచేస్తున్నాం..

డిసెంబర్ 2023లో మా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పటి నుండి, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయ డం ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటిగా ఉందని, కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం సుప్రీంకోర్టు, ట్రిబ్యునల్, చట్టబద్ధమైన సంస్థలు, భారత ప్రభుత్వం వంటి ప్రతి వేదికపైనా మా ప్రభుత్వం సమర్థవంతంగా పోరాడిందన్నారు.

మా ప్రభుత్వానికి గతంలో పెండింగ్లో ఉన్న అనేక ప్రాజెక్టులు వారసత్వంగా వచ్చాయని, కాబట్టి ప్రస్తుతం కొనసాగుతున్న, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులైన పాలమూరు- ఎత్తిపోతల పథకం, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం ఇలా ఇంకా చాలా మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం, ఎలిమినేటి మాధవ రెడ్డి శ్రీశైలం ఎడమ గట్టు కాలువ ప్రాజెక్టు, ఉదయ సముద్రం, డిండి ఎత్తిపోతల పథకం, మహాత్మా గాంధీ ఎంబీసీ ఎత్తిపోతల పథకం, జాన్‌పాడు ఎత్తిపోతల పథకం, మోతె ఎత్తిపోతల పథకం, జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం, సీతారామ ఎత్తిపోతల పథకం, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, గౌరవెల్లి ప్రాజెక్టు, ఎర్రపాలెం జవహర్‌లాల్ లిఫ్ట్‌ఇరిగేషన్ ప్రాజెక్ట్, త్రివేణి సంగమం, పులిమడుగువాగు, కుమరంభీంవాగు, చిక్మానువాగు, కెరామేరి మండలంలోని అమ్మవారి మడగాస్కర్, లెండిగూడ జైనూర్ (మంటో) ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగా మేము కృషి చేస్తున్నామన్నారు.

గత ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదాన్ని మా ప్రభుత్వం సరిదిద్ది, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కూడా చేపడుతుందని, గతంలో ప్రభుత్వం సకాలంలో పూడిక పనులు చేపట్టకపోవడం వలన అనేక ప్రాజెక్టులలో పూడిక (సెడిమెంటేషన్) పేరుకుపోయి రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయిందని తెలిపారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (చీ) అభివృద్ధి చేసిన డిజిటల్ సేవలు సారథి, వాహన్ లను తెలంగాణలో అమలు చేస్తున్నాము. వరంగల్ విమానాశ్రయం కోసం భూ సేకరణను పూర్తిచేసి, నిర్మాణపు పనులను వేగవంతం చేస్తామన్నారు. 

మెట్రో విలీనం..

ప్రతి నగరం హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో పనిచేస్తున్నదని తెలిపారు. హైడ్రా సంస్థ ప్రజా ఆస్తుల రక్షణ,  విపత్తు నిర్వహణ కోసం ప్రారంభమైందని, ఇప్పటివరకు 1045 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుండి తిరిగి స్వాధీనం చేసుకుందని, వీటి విలువ సుమారు 60 వేల కోట్లు ఉంటుందన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టును ఎల్ అండ్ టీ సంస్థ నుంచి తెలంగాణ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం రవాణా చరిత్రలో సాహసోపేతమైన నిర్ణయమన్నారు. 

గోదావరి పుష్కరాలకు 500 కోట్లు..

మూసీనది పునరుద్ధరణ కోసం 55 కి.మీ పరిధిలో భారీ అభివృద్ధికి, గోదావరి ప్రాజెక్టు ద్వారా 2.5 టీఎంసీల నీరు మూసీకి తరలించనున్నామని తెలిపారు. 45 ఎస్టీపీలు ఇప్పటికే పని చేస్తుండగా, అదనంగా మరో 39 ఎస్టీపీలు మంజూరు చేయగా, అవి వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు.  ఈసా, మూసీ నదుల సంగమ ప్రదేశంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోందన్నారు. బఫర్ జోన్‌లో ఉన్న ప్రజలకు పునరావాసం కల్పిస్తామని స్పష్టం చేశారు.

మా ప్రభుత్వం హైదరాబాద్, హైదరాబాద్ చుట్టు ప్రక్కల వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి వివిధ సంస్థల ద్వారా సుమారు 43 వేల 592 కోట్ల 88 లక్షల రూపాయల పనులను మంజూరు చేసిందన్నారు. వాటిలో ఇప్పటికే 24,752 కోట్ల రూపాయల పనులు ప్రారంభమయ్యాయని, మిగిలినవి త్వరలోనే చేపడుతామన్నారు.

నక్సలిజాన్ని గత ప్రభుత్వం, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కేవలం‘శాంతి-భద్రతల సమస్యగానే పరిగణించి, పోలీసు, సైనికబలగాలతో అణచివేసే ప్రయత్నంచేశాయని, తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన దార్శనిక విధానం దేశానికే ఒక ఆదర్శ నమూనాగా నిలిచిందన్నారు. పన్నెండేళ్లకు ఒకసారి అత్యంత పవిత్రంగా జరుపుకునే గోదావరి పుష్కరాలు తెలంగాణ రాష్ట్రంలో 2027 జూన్ 26 నుండి జూలై 7 వరకు జరగనున్నాయని, ప్రభుత్వం బడ్జెట్‌లో 500 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నామని పేర్కొన్నారు. 

గ్రోత్ ఇంజిన్‌గా..

2025--26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం రూ. 17,82,198 కోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధిరేటు 10.7 శాతంగా నమోదు అయ్యిందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తెలిపారు. తెలంగాణ వృద్ధి రేటు దేశ సగటు వృద్ధి రేటు కంటే 2.7 శాతం ఎక్కువగా ఉందని, అదే విధంగా దేశ జీడీపీలో రాష్ట్ర జీఎస్‌డీపీ 5.0 శాతం వాటా కలిగి దేశానికి ఒక బలమైన ‘గ్రోత్ ఇంజిన్’గా తెలంగాణ నిలుస్తోందన్నారు. దేశ వృద్ధిరేటు తగ్గినా, మన రాష్ట్ర వృద్ధిరేటులో పెరుగుదల ఉందన్నారు.

ప్రస్తుత ధరల ప్రకారం 2024--25 ఆర్థిక సంవత్సరంలో 9.8 శాతంగా ఉన్న దేశ జీడీపీ వృద్ధి రేటు, 2025--26 నాటికి 8 శాతానికి పడిపోయిందన్నారు. ఇదే సమయంలో రాష్ట్ర  స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి వృద్ధిరేటు 2024 --25లో 10.6 శాతం నుంచి 2025--26 నాటికి 10.7 శాతానికి పెరిగిందని తెలిపారు.

రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని, 2025--26 ఆర్థిక సంవత్సరంలో, ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931 కాగా, వృద్ధి రేటు 10.2 శాతంగా ఉందన్నారు. దేశ తలసరి ఆదాయం రూ.2,19,575 కాగా వృద్ధిరేటు కేవలం 6.9 శాతమని, దేశ తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణ తలసరి ఆదా యం రూ.1,99,356 (1.9 రెట్లు) ఎక్కువగా ఉందన్నారు.

భవిష్యత్‌కు విద్యుత్ రంగమే పునాది..

విద్యుత్ అభివృద్ధి, విశ్వసనీయత, భవిష్యత్తు దిశగా తెలంగాణ మన ప్రజా ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని కేవలం సరఫరా వ్యవస్థగా కాకుండా సామాజిక న్యాయం, ఆర్థిక వృద్ధి, భవిష్యత్ తెలంగాణకు పునాదిగా భావిస్తోందని, విద్యుత్ అనేది కేవలం సేవ కాదు, అదిసమాజం ఎలా పనిచేస్తుందో చెప్పేఅద్దమన్నారు. ప్రస్తుతం తెలంగాణలో విద్యుత్ రంగం దేశంలోనే అత్యుత్తమంగా నిలవడానికి కారణం నిరంతర సరఫరా మాత్రమే కాదని, నాణ్యత, విశ్వసనీయత, ప్రజా కేంద్రిత పాలన అన్నారు.

ప్రస్తుతం మనరాష్ట్రంలో 23,187 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉందని, అందులో గణనీయమైన భాగం పునరుత్పాదక శక్తి వనరుల నుంచే వస్తోందన్నారు. మార్చి 13, 2026 రోజున 18,228 మెగావాట్ల గరిష్ట డిమాండును సమర్థవంతంగా నెరవేర్చడమే కాకుండా 341.08 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసి రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక వినియోగాన్ని నమోదుచేశామన్నారు. ఇది తెలంగాణ అభివృద్ధి వేగాన్ని స్పష్టంగా చూపించే సూచిక అన్నారు.

మన ప్రభుత్వం విద్యుత్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో ఒక కొత్త విధానాన్ని తీసుకువచ్చిందన్నారు. అధికారులు కార్యాలయాల్లో కాకుండా ప్రజల మధ్యకు వెళ్లే విధంగా ‘ప్రజాబాట--పొలంబాట’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో మూడు 800 మెగావాట్ల యూనిట్లను ప్రారంభించి మరొక యూనిట్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేశామన్నారు.

పునరుత్పాదక శక్తి రంగంలో తెలంగాణ ముందంజలో ఉందని, సౌర ప్రాజెక్టులు, సోలార్ విలేజ్‌లో రూఫ్ టాప్ విస్తరణ మాత్రమే కాదు పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులను విద్యుత్ వినియోగదారులుగా కాకుండా విద్యు త్ ఉత్పత్తి దారులుగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థకు అవసరమైన బొగ్గు సరఫరాలో సింగరేణి సంస్థ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిలో ఈ సంస్థ తన పాత్రను పోషిస్తోందన్నారు.

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా..

ప్రపంచంలోని ఏ అభివృద్ధి చెందిన దేశానికీ సాధ్యంకాని రీతిలో, కనివిని ఎరుగని ఒక మహాత్తర జీవిత బీమా పథకానికి ఈ బడ్జెట్‌లో శ్రీకారం చుడుతున్నామని పేర్కొన్నారు. సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా పేద, మధ్యతరగతి, ధనిక అని తేడా చూడకుండా రాష్ట్రంలోని 1 కోటి 15 లక్షల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా జూన్, 02, 2026 నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని నూతనంగా ప్రవేశపెడ్తున్నామని వివరించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింతగా చేరువ చేయాలనే సంకల్పంతో రాష్ట్రంలో ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించిందని తెలిపారు. ఈ కార్యక్రమం 2026, మార్చి6 నుంచి జూన్ 12 వరకు సాగుతుందని తెలిపారు. 

గత ప్రభుత్వంలో దారిమళ్లిన నిధులు

ప్రస్తుతం 200 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ఒక మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వం 2014-23 వరకు కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను సరైన రీతిలో వినియోగించలేదని, కేంద్రం నుంచి మంజూరైన నిధులను కూడా ఆయా పథకాల అమలుకు ఖర్చు చేయకుండా, ఇతర అవసరాలకు మళ్లించడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన తదుపరి వాయిదాలు నిలిచిపోయి, తెలంగాణకు నష్టం జరిగిందన్నారు.

ఈ పరిస్థితిని వెంటనే గుర్తించి గత పదేళ్లలో ఆయా పథకాలకు బకాయి పడ్డ నిధులన్నింటినీ సంబంధిత శాఖలకు సుమారు రూ. 3 వేల కోట్లను ఈ ఆర్థిక సంవత్సరంలో విడుదల చేశామని పేర్కొన్నారు. మన రాష్ట్ర అభివృద్ధి కోసం కో-ఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, 2021--22 సంవత్సరంలో రాష్ట్రానికి కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా వచ్చిన నిధులు రూ. 4 వేల కోట్లు కాగా, మా ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి దాకా రూ. 7,072 కోట్లను సాధించిందని వెల్లడించారు. 

ప్రజలకు హెల్త్ ప్రొఫైల్.. 

ఇంతకాలం గ్రాంట్ -ఇన్ -ఎయిడ్ సంస్థగా ఉన్న 12 వేల 720 బెడ్స్ సామర్ధ్యం గల తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను పూర్తిస్థాయి ప్రభుత్వ సెకండరీ హెల్త్ కేర్ విభాగంగా మార్పు చేస్తున్నామని తెలిపా రు. ప్రజలందరికి డిజిటల్ హెల్త్ కార్డులు అం దజేస్తామని.. వీటి నిర్వహణలో అత్యంత గోప్యతను పాటిస్తామని స్పష్టం చేశారు.

2023 డిసెంబర్ నాటికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30,377 పడకలు అందుబాటులో ఉండగా, కొత్తగా ప్రారంభించిన 9 ప్రభుత్వ వైద్య కళాశాలల ద్వారా మరో1,980 టెర్షియరీ పడకలు అందుబాటులోకి వచ్చాయని, దీనికి అదనంగా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 సంవత్సరంలో 4,540 కొత్త బెడ్స్ అందుబాటులోకి రావడంతోపాటు 2026 చివరి నాటికి సనత్ నగర్, ఎల్బీనగర్, అల్వాల్‌లోని టిమ్స్ ఆసుపత్రులతో పాటు వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో కలిపి మరో 6,582 పడకలను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం పడకల సంఖ్య 44,029 కు చేరుకుంటుందని తెలిపారు. 

ఖర్చుకాని సబ్ ప్లాన్ నిధులు రూ. 14 వేల కోట్లు..

అంతరాలు లేని సమాజం కోసం మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు సామాజిక న్యాయం చేయాలనేది మా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. వసతిపాఠశాలలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్ర మాల ద్వారా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలును సంపూర్ణంగా అమలు చేయడానికి మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, మా ప్రభుత్వం ఏర్పడిన నాటికే 2023--24 ఆర్థిక సంవత్సరం నాటికి సబ్ ప్లాన్ చట్ట ప్రకారం ఖర్చు చేయాల్సిన నిధులలో ఎస్సీలకు చెందిన 13 వేల 617 కోట్లు, ఎస్టీలకు చెందిన 1,317 కోట్లు, మొత్తం 14 వేల 934 కోట్లు ఖర్చు కాకుండా ఉందన్నారు.

2024--25 ఆర్థిక సంవత్సరానికి ఈ క్యారీ ఫార్వర్డ్ చేయవలసిన నిధులు, ఎస్సీలకు 7,757 కోట్లు, ఎస్టీలకు 1,754 కోట్లు ఖర్చు చేయవలసి ఉందని, వాటిని మేము 2026--27 ఆర్థిక సంవత్సరంలో కేటాయించాల్సిన మొత్తానికి అదనంగా 2024--25 ఆర్థిక సంవత్సరానికి చెందిన బకాయిలను కూడా కేటాయిస్తున్నామని తెలిపారు.

హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద కొత్తగా డా.బీ.ఆర్.అంబేద్కర్ నాలెడ్జ్ టవర్‌ను, నింబోలి అడ్డ కాచిగూడలో బాబూ జగ్జీవన్ రామ్‌పేరుతో నూతన వసతి గృహాన్ని నిర్మిస్తామని తెలిపారు. గిరిజనాభివృద్ధి కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో బీసీల కీలక పాత్రను గుర్తించిన ప్రభుత్వం విద్యా, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక సాధికారత, గ్లోబల్ అవకాశాలు, సాంప్రదాయ వృత్తుల రక్షణకు గౌరవం కల్పిస్తూ, భద్రతతో కూడిన జీవనాన్ని అందిస్తున్నదని చెప్పారు.