26 February, 2026 | 2:02 AM

గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి

26-02-2026 12:00 AM

సర్పంచ్ పాలకుర్ల కరుణాకర్ గౌడ్

కడ్తల్, ఫిబ్రవరి 25( విజయక్రాంతి): గ్రామ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పాలకవర్గం, ప్రజలు కలిసి పనిచేయాలని సర్పంచ్ పాలకుర్ల కరుణాకర్ గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం ఎక్వాయిపల్లి గ్రామంలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు సమస్యలపై చర్చించి, భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించారు. గత ఏడాది విద్యుత్ దీపాల సమస్యను పరిష్కరించామని, డ్రైనేజీ మరియు తాగునీటి పైపుల మరమ్మత్తులు పూర్తి చేశామని తెలిపారు.

నియోజకవర్గం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి నిధులతో త్వరలోనే గ్రామంలో సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాలువల నిర్మాణం చేపట్టనున్నట్లు హామీ నిచ్చారు. గ్రామసభ అనంతరం సర్పంచ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు.ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్తో కలిసి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలని విద్యార్థులను ప్రోత్సహించారు.

పదవ తరగతి పరీక్షలో మంచి ఫలితాలు సాధించి గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పదవ తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం అందించే అల్పాహార ఖర్చులను తానే భరిస్తానని సర్పంచ్ హామీ ఇచ్చారు. మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి, వంట ఏజెన్సీకి తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పుట్టి లక్ష్మి యాదయ్య, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి కృష్ణమాచారి, పాఠశాల సిబ్బంది మరియు గ్రామ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.