పెచ్చరిల్లుతున్న నేరప్రవృత్తి
- భావోద్వేగంతో నిరసన తెలిపిన జనం..
అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నాం..
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి, మార్చి 27 (విజయక్రాంతి) : అక్షర స్కూల్ లో మైనార్టీ విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి మొత్తం సమాజానికి తలవంపు చర్యగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన ద్వారా అభివర్ణించారు. అత్యంత హేయమైన సంఘటనను యాజమాన్యం పోలీసులకు తెలియజేయకుండా దాచిపెట్టడం నేరమన్నారు.
బాధితులకు అండగా నిలవాల్సిన పోలీస్ అధికారులు భావోద్వేగంతో నిరసన తెలిపినవారిపై ప్రశ్నించడానికి వెళ్ళిన బి.ఆర్.ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ భేషరతుగా అక్రమ కేసులు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.సమాజములో జరుగుతున్న అసహజ సంఘటనలు మనసును కలచివేస్తున్నాయని నేరప్రవృతి పశువుల కంటే హీనంగా పెచ్చరిల్లుతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అక్షర స్కూల్ గుర్తింపు వెంటనే రద్దు చేయాలి.. అక్రమ కేసులు రాజకీయ ప్రేరేపిత చర్యకు నిదర్శనం
వనపర్తి, మార్చి 27 (విజయక్రాంతి) : అక్షర స్కూల్‌లో మైనార్టీ విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడిని మరియు సంఘటన వెలుగులోకి రాకుండా పాఠశాల యాజమాన్యం దాచిపెట్టడం రాజకీయాలకతీతంగా ఖండించాలని గట్టు యాదవ్, పుట్ట ఆంజనేయులు, పలుస రమేష్ గౌడ్, షేక్ జహంగీర్, హేమంత్ ముదిరాజ్ లు పిలుపునిచ్చారు. శుక్రవారం మాజీ మంత్రి నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
అక్రమ కేసుల నుండి బి.ఆర్.ఎస్ నాయకులకు ఊరట కలగడం పోలీస్ అధికారులకు చెంపపెట్టు లాంటిదని అన్నారు. ఎమ్మెల్యే తొత్తులుగా మారి పోలీస్ అధికారులు నిన్న ప్రవర్తించిన తీరు ప్రజలలో పోలీస్ వ్యవస్థపై చులకన భావం ఏర్పడ్డదన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ మదన్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, జోహెబ్ హుస్సేన్,సమద్, ఇమ్రాన్,అస్లాం, జెమిల్,సి.పి.ఎం నాయకులు పరమేశ్వర చారి,డి.కురుమయ్య,బాలస్వామి ఉన్నారు.




