ఏటా 10 లక్షల విత్తన బంతులు.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యం
దశాబ్దంగా ఉచిత పంపిణీ.. చెట్ల పెంపకానికి ప్రభాకర్ వర్మ కృషి..
సిద్దిపేట రూరల్, ఆగస్టు 2: పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రతి సంవత్సరం 10 లక్షల విత్తన బంతులు తయారు చేసి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు నవ సమాజ నిర్మాణ సమితి జాతీయ అధ్యక్షుడు లక్కరసు ప్రభాకర్ వర్మ తెలిపారు. గత పదేళ్లుగా లైఫ్ ఎన్జీవోకు చెందిన దేవరగట్టు బాలప్రసాద్ సహకారంతో మర్రి, వేప, రావి, చింత, ఉసిరి, మామిడి తదితర వృక్షాల విత్తన బంతులను తయారు చేసి రోడ్ల పక్కన, గుట్టలు, అడవుల్లో చల్లుతున్నట్లు చెప్పారు.
ఆదివారం సిద్దిపేట మండలం చిన్నగుండవెల్లి గ్రామంలో సర్పంచ్ మెరుపుల రోజావీరు గౌడ్, రావురూకుల సర్పంచ్ తిరుపతి, పుల్లూరు సర్పంచ్ లత–వెంకట్ యాదవ్, మాజీ కౌన్సిలర్ మామిళ్ల ఐలయ్య యాదవ్, మాజీ సర్పంచ్ అన్నసారం పరమేష్, లెక్చరర్ మామిండ్ల రాము యాదవ్, హరికృష్ణ తదితరులతో కలిసి విత్తన బంతులను చల్లారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్రతి ఒక్కరూ చెట్ల పెంపకాన్ని బాధ్యతగా తీసుకోవాలని ప్రభాకర్ వర్మ పిలుపునిచ్చారు. తమ ప్రాంతాలకు విత్తన బంతులు కావాలనుకునే వారికి ఉచితంగా అందజేస్తామని తెలిపారు.






