6 June, 2026 | 3:04 AM

అడవుల పరిరక్షణతోనే పర్యావరణ సమతుల్యత

06-06-2026 01:12 AM

ఫోర్ ఇన్ వన్ పర్యాటక ప్రాంతాలు కలిగిన ప్రాంతం ములుగు జిల్లా

భక్తిభావం ఉట్టిపడేలా మేడారాన్ని పచ్చగా తీర్చిదిద్దాలి

రాష్ట్రంలోనే అత్యధిక అడవులతో ములుగు ప్రథమ స్థానం

నియోజకవర్గంలో 77 శాతం, జిల్లాలో 64 శాతం అడవులు

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క

ములుగు (మహబూబాబాద్), జూన్ 5 (విజయక్రాంతి): అడవుల పరిరక్షణతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని, సరస్సు, అటవీ, ఆధ్యాత్మిక, పర్వత పర్యాటక ప్రాంతాలు ఒకేచోట ఉన్న అరుదైన జిల్లాగా ములుగు ప్రత్యేక గుర్తింపు పొందిందని, రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లా, నియోజకవర్గంగా ములుగు అగ్రస్థానంలో ఉందని, నియోజకవర్గంలో 77 శాతం, జిల్లాలో 64 శాతం అడవులు ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. మేడారాన్ని మరింత పచ్చదనంతో తీర్చిదిద్ది, అటవీ సంపదను భావితరాలకు అందించేందుకు సమిష్టిగా కృషి చేయాలని మంత్రి సీతక్క అన్నారు.

99 రోజుల ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ములుగు జిల్లా ఇంచర్ల ఏకో పార్క్లో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి దనసరి అనసూయ సీతక్క, ముఖ్య అటవీ సంరక్షణాధికారి కాళేశ్వరం జోన్ బి. ప్రభాకర్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క, సీసీఎఫ్ ప్రభాకర్, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్, ఇంచర్ల సర్పంచ్ కుమార్ గౌడ్ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటారు.

అనంతరం అటవీ శా ఖ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను సందర్శించి, అటవీ సంపద సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ, వన్యప్రాణుల రక్షణకు సంబంధించిన చిత్రాలను వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, అడవుల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. అటవీ సంరక్షణపై గ్రామస్థాయిలో ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. వన సంరక్షణ కమిటీల తరహాలో గ్రామ సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, స్థానిక యువతతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి అడవుల రక్షణ బాధ్యతలను అప్పగిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో ఇప్ప పువ్వుతో తయారయ్యే ఉత్పత్తులకు మంచి గుర్తింపు ఉందని, కంక వనాలు, ఇప్ప చెట్ల పెంపకంపై గిరిజనులకు శిక్షణలు అందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అ త్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లాగా ములుగు జిల్లా నిలిచిందని, ములుగు నియోజకవర్గంలో సుమారు 77 శాతం అటవీ విస్తీర్ణం ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో సుమారు 64 శాతం అటవీ విస్తీర్ణంతో ములుగు రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉందని తెలిపారు. ఈ అటవీ సంపదను భా వితరాలకు అందించేందుకు మరింత శ్రద్ధతో సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజలకు స్వచ్ఛమైన గాలి, తగిన వర్షపాతం, ఆరోగ్యకరమైన జీవన వాతావరణం అందాలంటే అడవుల పెంపకం, పరిరక్షణ అత్యంత అవసరమని అన్నారు. మేడారం ప్రాంతాన్ని మరింత పచ్చదనంతో అభివృద్ధి చేయాలని, మాస్టర్ ప్లాన్ ప్రకారం రహదారుల ఇరువైపులా చెట్ల పెంపకం, డివైడర్ల అభివృద్ధి, కంక వనాల ఏర్పాటు వంటి కార్యక్రమాలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సమ్మక్క, సారలమ్మల వనదేవతల భక్తి భావం, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కంక వనాలు, ఇప్ప చెట్ల పెంపకానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఇప్ప పువ్వుతో తయారయ్యే ఆహార పదార్థాలకు మార్కెట్ అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో గిరిజనులకు శిక్షణలు అందించి, వాటిని జీవనోపాధి అవకాశాలుగా మలిచేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.

ములుగు జిల్లాలోని లక్నవరం, రామ ప్ప, మల్లూరు, గోదావరి పరివాహక ప్రాం తాలు దేశ విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా సీసీఎఫ్ ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రపంచ పర్యావరణ దినోత్సవం కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా, పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రతి ఒక్కరిలో బాధ్యతను పెంపొందించే సందర్భంగా భావించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ములుగు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు.

సరస్సు, అటవీ, ఆధ్యాత్మిక, పర్వత పర్యాటక వనరులు ఒకే జిల్లాలో సమృద్ధిగా ఉండటం ములుగు జిల్లాకు ప్రత్యేకత అని పేర్కొన్నారు. జిల్లాను రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అటవీ శాఖతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా,  ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్, ఐటిడిఏ పీవో లెనిన్ వస్సల్ టోప్పో, పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, ఇంచర్ల ఉప సర్పంచ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అటవీ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

లింగాల, పోచపూర్‌లో ప్రజా దర్బార్

మంత్రి సీతక్క ములుగు జిల్లాలోని లింగాల, పోచాపూర్ గ్రామాల్లో శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించారు. అలాగే బంధాల గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. బంధాల నుంచి పోచపూర్ వరకు ఐదు కోట్ల రూపాయలతో నిర్మించే నూతన రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వన్యప్రాణుల దాడిలో మరణించిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుండి మంజూరైన పరిహారం చెక్కులను అందజేశారు.