6 July, 2026 | 8:14 PM

ఎన్యూమరేషన్ ప్రక్రియను ఆగస్టు 30 వరకు పొడిగించాలి

06-07-2026 07:14 PM

సీపీఐ నాయకుడు కమటం వెంకటేశ్వర్లు

అశ్వాపురం,(విజయక్రాంతి): రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)లో భాగమైన ఎన్యూమరేషన్ ప్రక్రియను ఆగస్టు 30 వరకు పొడిగించాలని భారత ఎన్నికల సంఘాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కమటం వెంకటేశ్వర్లు కోరారు. సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్ ప్రక్రియ గందరగోళంగా సాగుతోందని, ఇప్పటికీ పలువురు ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఈ ప్రక్రియపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు.

ఎన్యూమరేషన్‌పై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడంతో ఫారాలు నింపడంలో అనేక సందేహాలు, అపోహలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. కొంతమంది బీఎల్‌వోలు ఇంకా పూర్తిస్థాయిలో విధులు నిర్వహించడం లేదని, ఓటర్ల సందేహాలను నివృత్తి చేయడంలో అవగాహన లోపిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసి బీఎల్‌వోలకు అందజేయడానికి మరింత సమయం అవసరమని, అందువల్ల ఎన్యూమరేషన్ గడువును ఆగస్టు 30 వరకు పొడిగించడంతో పాటు గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.