25 February, 2026 | 1:49 AM

ఆర్టీసీకి 1,085 ఎలక్ట్రిక్ బస్సులు

24-02-2026 12:45 AM
  1.  సరఫరా చేయనున్న ఒలెక్ట్రా

 ‘పీఎం ఈఠూటీ-డ్రైవ్’లో సరఫరా

హైదరాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)కి ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ (ఓజిఎల్) 1,085 బస్సులను సరఫరా చేయనుందని ఒలెక్ట్రా ఎండీ మహేష్‌బాబు తెలిపారు. ఈ మేరకు ఒలెక్ట్రా సంస్థకు టీజీఎస్‌ఆర్టీసీ లెటర్ అఫ్ ఇంటెంట్ (ఎల్‌ఓఐ) జారీ చేసిందని సోమవారం ఆయన ప్రకటనలో తెలిపారు. పీఎం ఈఘూ పథకంలో భాగంగా పర్యావరణ అనుకూల ఇంధన, విద్యుత్ వాహనాలను ప్రోత్సహించే కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సి ఈఎస్‌ఎల్) ఆధ్వర్యంలో ఈ లేఖను జారీ చేసిందని తెలిపారు.

ఆ బస్సుల ద్వారా  హైదరాబాద్ నగర ప్రజలకు సుస్థిర, పర్యావరణ హితమైన, సమర్ధవంతమైన ప్రజా రవాణా వ్యవస్థను టిజిఎస్‌ఆర్టీసీ అందించనుందని తెలిపారు. పట్టణాలలో ఎలక్ట్రిక్ ప్రజా రవాణాను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న పిఎంఈ డ్రైవ్  పథకం హైదరాబాద్ నగరాన్ని విద్యుత్ రవాణా వ్యవస్థ  దిశగా మరింత ముందుకు తీసుకెళ్ళనుందని ఆయన పేర్కొన్నారు. ఓలెక్ట్రా 12 మీటర్ల పొడవు  ఉన్న లో ఫ్లోర్ బస్సులను సరఫరా చేయనుందని, ఇందులో ఏసీ, నాన్- ఏసీ బస్సులున్నాయని, స్థానిక రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా వీటిని  రూపొందించారని వెల్లడించారు.

బస్సు ముందు, వెనుక భాగంలో ఆధునిక ఎయిర్ సస్పెన్షన్ వ్యవస్థతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే  250 కిలోమీటర్లకు పైగా ప్రయాణ  చేస్తాయని, సుమారు 45 నిమిషాల్లో ఆపర్చునిటీ ఛార్జింగ్ సౌకర్యం ఈ బస్సుల్లో  ఉందన్నారు. బస్సులో వీల్‌చైర్ వినియోగదారులకు ప్రత్యేక స్థలం కేటాయించినట్లు వెల్లడించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ దృష్టితో ప్రపంచ స్థాయి ఎలక్ట్రిక్ బస్సులను తయా రు చేయాలనే తమ కట్టుబాటుకు పీఎం ఈ-డ్రైవ్ కార్యక్రమం కింద వచ్చిన ఈ ప్రతి ష్టాత్మక ఆర్డర్ మరింత బలమిచ్చిందన్నారు.