18 May, 2026 | 12:08 PM

సమస్యల పరిష్కారానికి చర్యలు: ఎమ్మెల్యే తలసాని

18-05-2026 12:00 AM

సికింద్రాబాద్, మే 17 (విజయక్రాంతి): హాస్టల్ నిర్వాహకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం అమీర్‌పేట హాస్టల్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి ఆధ్వర్యంలో వెస్ట్ మారేడ్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిశారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు పలు సమస్యలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు వివరించారు. ఎస్సార్ నగర్, బాపూనగర్, శివబాగ్ కాలనీ, బి.కె గూడ తదితర ప్రాంతాల్లో 950 వరకు హాస్టళ్లు ఉన్నాయని, వీటిలో ప్రస్తుతం 50 శాతం మంది విద్యార్థులు అంటే సుమారు 25 వేల మంది వరకు విద్యార్థులు ఉంటున్నారని పేర్కొన్నారు.

గ్యాస్ కొరత, వర్క్‌ఫ్రమ్ హోంతో విద్యార్థులు, హాస్టళ్లలో ఉన్నవారు ఇళ్లకు వెళ్లిపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని తలసానికి వివరించారు. ఎమ్మెల్యే తలసాని మాట్లాడుతూ త్వరలోనే హాస్టళ్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో అమీర్‌పేట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, అసోసియేషన్ ప్రతినిధులు కోసరాజు రాజశేఖర్, తులసిరామ్, శ్రీనివాస్, సురేష్, సుబ్బయ్య తదితరులు ఉన్నారు.