27 May, 2026 | 1:37 AM

అనువంశిక అర్చకుల హక్కుల పునరుద్ధరణకు కృషి చేయాలి

27-05-2026 12:00 AM

బ్రాహ్మణ పరిషత్ చైర్మన్‌కు వేములవాడ బ్రాహ్మణ కుటుంబాల వినతి

వేములవాడ, మే 26,(విజయక్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడలోని బ్రాహ్మణ అనువంశిక అర్చక కుటుంబాల సభ్యులు, వేములవాడ బ్రాహ్మణ భాగ్యనగర సమితి నాయకులు మంగళవారం బ్రాహ్మణ పరిషత్ భవనంలో బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యంను కలిసి వినతి పత్రం సమర్పించారు.తెలంగాణలోని దేవాలయాల్లో రద్దు చేయబడిన అనువంశిక అర్చకుల హక్కులను పునరుద్ధరించాలని వారు కోరారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యపై ముఖ్యమంత్రిని ఒప్పించి అనువంశిక హక్కుల పునరుద్ధరణకు కృషి చేయాలని, తద్వారా బ్రాహ్మణ కుటుంబాల అభ్యున్నతికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ సానుకూలంగా స్పందిస్తూ, వచ్చేనెల జరగబోయే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించి అనువంశిక హక్కుల పునరుద్ధరణకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే అర్హులైన బ్రాహ్మణులకు పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై కూలంకషంగా చర్చించి త్వరలోనే పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వేములవాడ బ్రాహ్మణ నాయకులు ఉపాధ్యాయుల సాంబశివుడు, వఝల సతీష్ శర్మ, వఝల శ్యాం ప్రసాద్ శర్మ, అడ్వకేట్ వాసాలమర్రి నాగరాజ శర్మ, దివిన్నగారి శిరీష్ శర్మ, వజ్జల వేణుగోపాల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.