28 August, 2026 | 10:45 AM

ఐదు చెరువులకు నీరందించేలా అమెర్ధ వద్ద లిఫ్ట్‌ ఏర్పాటు చేయాలి

27-08-2026 05:25 PM

మంత్రులు, ఎమ్మెల్యేకు చింతిర్యాల కాలనీ ఉపసర్పంచ్‌ వెన్న అశోక్‌కుమార్‌ వినతి

అశ్వాపురం, ఆగస్టు 27 (విజయక్రాంతి): మండలంలోని మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి శనివారం రానున్న రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు చింతిర్యాల కాలనీ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్‌, రైతు వెన్న అశోక్‌కుమార్‌ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. సీతారామ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన రైతులతో పాటు మిగిలిన రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అమెర్ధ వద్ద ప్రత్యేకంగా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు.

అమెర్ధ, సండ్రలబోడు, చింతిర్యాల, చింతిర్యాల కాలనీ గ్రామపంచాయతీల పరిధిలో సుమారు ఐదు చెరువులు, 500 ఎకరాల మేర సాగుభూమి ఉందని, అమెర్ధ వద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఏర్పాటు చేస్తే ఈ చెరువులను గోదావరి జలాలతో నింపి రైతులకు సాగునీరు అందించవచ్చని తెలిపారు. తద్వారా రైతులు రెండు పంటలు సాగు చేసుకునే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. మారెళ్లపాడు ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ప్రాంత రైతుల చిరకాల సమస్యను మంత్రులు, ఎమ్మెల్యే ప్రత్యేకంగా గుర్తించి, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని వెన్న అశోక్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు.