24-02-2026 12:11:02 AM
నూతనకల్, ఫిబ్రవరి 23: రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని తుంగతుర్తి సీఐ నరసింహారావు పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా వాహనదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మద్యం మత్తులో వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరమని, ఇది చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.
మద్యం తాగి వాహనం నడపడం వల్ల వాహనదారునికే కాకుండా, రోడ్డుపై వెళ్లే అమాయకుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలను అతిక్రమించి మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, జైలు శిక్ష కూడా తప్పదని స్పష్టం చేశారు.ప్రమాదాల నివారణకు తాము నిత్యం మద్యం మత్తు తనిఖీలు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నామని, వాహనదారులు పోలీసుల సూచనలను పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్త్స్ర నాగరాజు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.