అద్దె ఆర్టీసీ బస్సు డ్రైవర్లు నిర్భయంగా బస్సులు నడపవచ్చు
పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం భరోసా
కరీంనగర్ క్రేమ్,(విజయక్రాంతి): ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజలకు రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ముందుకు వచ్చే అద్దె ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరూ భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, విధుల్లో చేరే అద్దె ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు పోలీసు శాఖ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.అద్దె ఆర్టీసీ డ్రైవర్లు ఎలాంటి జంకు లేకుండా ఆర్టీసీ బస్సులు నడపడానికి ముందుకు రావాలని సీపీ పిలుపునిచ్చారు.
ప్రయాణికుల సౌకర్యార్థం నడిపే బస్సులకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు కానీ, యూనియన్ నాయకులు కానీ విధుల్లో ఉన్న అద్దె ఆర్టీసీ బస్సు డ్రైవర్లను అడ్డుకున్నా లేదా బెదిరింపులకు గురిచేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎవరైనా మిమ్మల్ని భయపెట్టాలని చూస్తే వెంటనే పోలీసు స్పెషల్ బ్రాంచి కంట్రోల్ రూమ్ నంబర్ 8712670713 కు కాల్స్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు.






