తక్కువ నీటితో పండించే పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి
* పంట మార్పిడి పై రైతులు దృష్టి పెట్టాలి
* తహసిల్దార్ స్రవంతి
గరిడేపల్లి,(విజయకాంతి): మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటల సాగు విధానాల్లో మార్పులు చేసుకోవాలని తక్కువ నీటితో పండే పంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని గరిడేపల్లి తాసిల్దార్ స్రవంతి సూచించారు. మండలంలోని పరెడ్డిగూడెం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం పంట మార్పిడిపై రైతులకు అవగాహన కార్యక్రమంలో ఏ ఈ ఓ శిరీష తో కలిసి ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులు సాగు చేస్తున్న బీర, దోస, మిరప తదితర పంటలను పరిశీలించి పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధిక దిగుబడులు సాధించేందుకు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, సుస్థిర నీటి వినియోగం, సస్యరక్షణపై రైతులకు దిశానిర్దేశం చేశారు. రానున్న సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసుకుని పంటలను ఎంచుకోవాలన్నారు.
ఏఈఓ శిరీష మాట్లాడుతూ.. తక్కువ నీటితో సాగు చేయగల ఉద్యానవన పంటలు, కూరగాయలు, పెసర్లు, మినుములు, జొన్నలు వంటి ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. విత్తన ఎంపిక నుండి దిగుబడి వరకు శాస్త్రీయ పద్ధతులు పాటిస్తే లాభసాటి దిగుబడులు సాధించవచ్చన్నారు. రైతుల కోసం క్షేత్రస్థాయిలోనే అవసరమైన ఉచిత సలహాలు, సూచనలు అందిస్తున్నామన్నారు..ఈ అవగాహన కార్యక్రమంలో పరెడ్డిగూడెం గ్రామ సర్పంచ్ కేతేపల్లి నరసయ్య, ఉప సర్పంచ్ మేకల మల్లారెడ్డి, పంచాయతీ కార్యదర్శి రేణుక, ఫీల్డ్ అసిస్టెంట్ బొబ్బ వెంకటరెడ్డి, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.






