20 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయండి
గ్రామ కంటంలో నిర్మాణ పనులకు అనుమతులు ఇవ్వండి
జవహర్ నగర్, ఆగస్టు 20 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ డివిజన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సిసి రోడ్ల నిర్మాణానికి 20 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు.మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో జవహర్ నగర్ డివిజన్ అధ్యక్షుడు, మాజీ మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ తదితరులు కమిషనర్ ను కలిశారు. జవహర్ నగర్ డివిజన్ లోని పలు కాలనీలలో దెబ్బతిన్న డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
20 కోట్లతో సమగ్ర అభివృద్ధి పనులు చేపట్టేందుకు వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రతిపాదనలను పరిశీలించి త్వరలో నిధులు మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు.గ్రామకంఠ పరిధిలో పాత ఇళ్లకు ఇంటి నిర్మాణ అనుమతులు ఇవ్వాలని కూడా వినతిపత్రంలో కోరారు. అర్హులైన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అనుమతులు మంజూరు చేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు బల్లి శ్రీనివాస్, చింతల శ్రీనివాస్, మాట్ల వినయ్, బొబ్బిలి మంజుల, విజయరాయ్, గజ్వెల్ శంకర్, వెంకటేశ్వర్, సుబ్రహ్మణ్యం, సాయి తదితరులు పాల్గొన్నారు.






