సబ్ రిజిస్ట్రార్ కోసం డబ్బులు వసూలు.. డ్రైవర్ అరెస్ట్
బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఖదీర్ కోసం డబ్బులు వసూలు ఆయన ప్రైవేట్ డ్రైవర్ ఫహీంను ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ మంగళవారం ఖమ్మం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కేసు వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రమైన బూర్గంపాడులో గతంలో సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఖధీర్ పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఏసీబీకి సైతం పలు ఫిర్యాదులు రావడంతో గత ఏడాది జూన్‌లో ఏసీబీ అధికారులు కార్యాలయంలో దాడులు చేసి తనిఖీలు నిర్వహించి ఫోన్ పే ద్వారా నగదు బదిలీ జరిగినట్లు గుర్తించడంతో పాటు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కార్యకలాపాలు నిర్వహించినట్లు గుర్తించారు.
ఆ తర్వాత సబ్ రిజిస్ట్రార్ భద్రాచలానికి బదిలీ కావడంతో సంఘటన జరిగిన కొద్దిరోజుల్లోనే అతడిని కూడా ఏసీబీ అధికారులు పట్టుకుని ఏసీబీ కోర్టుకు తరలించారు.అయితే బూర్గంపాడు లో జూన్‌లో జరిగిన ఏసీబీ దాడుల్లో సబ్ రిజిస్ట్రార్ ప్రైవేట్ డ్రైవర్‌కు సంబంధించిన కేసును విచారణ చేపట్టిన అధికారులు ఫోన్ పే ద్వారా నగదు బదిలీలు జరిగిన విషయాన్ని ధృవీకరించి తాజాగా ఖమ్మంలో డ్రైవర్ ఫహీంను అరెస్ట్ చేసి ఖమ్మం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఫహీం ముందుగా తన ఖాతాలో నగదు బదిలీ చేయించుకుని ఆ తర్వాత సబ్ రిజిస్ట్రార్‌కు ఇచ్చేవాడని విచారణలో తేలడంతో అరెస్టు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఏ అధికారైనా లంచం అడిగితే ఏసీబీ దృష్టికి తీసుకురావాలని, అలాంటి అవినీతి అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.






