24 June, 2026 | 4:54 AM

బంగాల్‌ను స్ఫూర్తిగా తీసుకోండి

24-06-2026 02:06 AM

తెలంగాణలోనూ అధికారంలోకి రావాలి

ప్రతి కార్యకర్త పట్టుదలతో పనిచేయండి

బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): ‘వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలి. బంగాల్ విజయంతో స్ఫూర్తి పొంది, తెలంగాణలోనూ పునరావృతం చేయాలి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. పశ్చిమబంగాల్ బీజేపీ కార్యకర్తల మాదిరిగా, తెలంగాణలోని పార్టీ శ్రేణులు కూడా పట్టుదలతో పోరాటం చేస్తే అధికారంలోకి రావడం కష్టమయ్యే పనేమి కాదని ధీమా వ్యక్తం చేశారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ (వర్ధంతి) సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతో పాటు మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ పశ్చిమబంగాల్‌ను దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్, కమ్యూనిస్టులు, టీఎంసీ పార్టీలు అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. నేడు బీజేపీ నాయకత్వంలో బంగాల్‌లో శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు.

శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ జీవితం దేశం కోసం చేసిన త్యాగానికి, ధైర్యానికి, రాజీలేని నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు. హైదరాబాద్, ఇతర సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ నిర్ణయాత్మక పాత్ర పోషించారని, అదే తరహాలో జమ్మూకశ్మీర్‌ను పూర్తిస్థాయిలో భారత్‌లో అంతర్భాగం చేసేందుకు శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ తన ప్రాణాలనే త్యాగం చేశారని స్పష్టం చేశారు.

ముఖర్జీ ధృడమైన నిర్ణయాల వల్లే నేడు పశ్చిమబంగా భారత్‌లో అంతర్భాగంగా ఉందన్నారు. హిందువుల రక్షణ కోసం ఆయన నిర్భయంగా పోరాడారని, విభజన, ఓటు బ్యాంకు తుష్టీకరణ రాజకీయాలకు వ్యతిరేకంగా బలంగా నిలబడ్డారని చెప్పారు. కోల్‌కతా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా పని చేసిన పిన్న వయస్కుడు ముఖర్జీ అని గుర్తుచేశారు. అధికారం, పదవుల కంటే దేశానికే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు.    

మేయర్ పీఠాలను దక్కించుకోవాలి

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాని రాంచందర్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి మేయర్ పీఠాలను దక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పలువురు ప్రముఖులు, మహిళా నేతలు బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, స్థానిక సమస్యలపై పోరాడాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు.