30 May, 2026 | 2:39 AM

అట్రాసిటీ కేసు బాధితులకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు

30-05-2026 12:28 AM

అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్

మేడ్చల్, మే 29(విజయ క్రాంతి): దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులలో బాధితులకు 2 బిహెచ్ కె ఇల్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుందని అదనపు కలెక్టర్  ఫైజాన్ అహ్మద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన  జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి ఎస్సీ, ఎస్టీ కమీషన్ సభ్యులతో కలిసి అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, విజయేందర్ రెడ్డి లు హాజరైనారు.

ఈ సందర్భంగా అదనపుకలెక్టర్ పైజాన్ అహ్మద్ మాట్లాడుతూ ప్రతి నెల 25వ తేది న తహాసీల్దార్లు తప్పనిసరిగా సివిల్  రైట్స్ డే  సమావేశాన్ని నిర్వహించాలన్నారు. సివి ల్ రైట్స్ డే కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని ఆదేశించారు.  ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసులకు సంబంధించి కుల ధృవీకరణ పత్రాలను త్వరిగతిన జారీ చేయాలన్నారు. పోలీసు శాఖ వారు  పెండింగ్ కేసుల పై ప్రత్యేక శ్రద్ద వహించి వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని తద్వారా కమీషన్ వారికి పురోగతి కనిపిస్తుందన్నారు.

జిల్లాలో ఒకరే పిపి ఉండడం వల్ల వారి అభిప్రాయానికి ఎక్కువ సమయం పడుతుందని మరొక పిపిని నిర్ణయించడానికి కమీషన్ వారు డివిఎంసి కమిటీ ద్వారా  తగిన చొరవ తీసుకోవాలని అదనపు కలెక్టర్ కోరారు. తప్పనిసరిగా మూడు నెలలకొకసారి డివిజన్ స్థాయిలో నిర్వహించి పెండింగ్ కేసులను క్లియర్ చేయాలన్నారు. సఫాయి కర్మచారిల గురించి ప్రత్యేకంగా ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. సఫాయి కర్మచారిలకు అందించే పిపిఈ కిట్, ప్రొటెక్టివ్ కిట్లను క్రమం తప్పకుండా అందించేందుకు మున్సిపల్ కమీషనర్లు, జోనల్ కమీషనర్లకు కలెక్టర్ ద్వారా లేఖలు అందజేస్తామన్నారు. ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతంరిజర్వేషన్ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిఈఓ ను ఆదేశించారు.

ఎస్సీ ఎస్టీ కమీషన్ సభ్యులు జిల్లా శంకర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టి కమీషన్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాను దత్తత తీసుకుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులలో బాధితులకు త్వరితగతిన న్యాయం చేకూరేలా అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపించాలని బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం వెంటనే అందించేలా చర్యలు తీసుకోవలన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కమీషన్ సభ్యు లు రాంబాబు నాయక్, డివిఎంసి సభ్యులు, డిఆర్‌ఓ మాలతి, ఆర్డిఓలు రాజేష్ కుమార్, శ్యాంప్రకాష్, పోలీసు ఉన్నత అధికారులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.