విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి
బెల్లంపల్లి,(విజయక్రాంతి): నీట్ పేపర్ లీకేజీకి బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని బర్తరఫ్ చేయాలనీ తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక (TVUV),BC విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి ఉద్యమ వేదిక నాయకులు చిప్పకుర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ. దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు రేయింబవళ్లు కష్టపడి రాసిన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వడం కేంద్ర విద్యాశాఖ నిర్లక్ష్యానికి నిదర్శనమనన్నారు. నీట్ పరీక్ష రద్దుతో దేశవ్యాప్తంగా 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు.
బిజెపి అధికారంలోకి వచ్చిన 13 సంవత్సరాల కాలంలో కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో 23 సార్లు పరీక్ష పత్రాలు లీకై పరీక్షలు రద్దు అవ్వడం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీ పార్టీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి నీ పదవి నుండి బర్తరఫ్ చేసి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA )బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాలని కోరారు. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా గత 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ తో చర్చల ద్వారా దీక్ష విరమింప చేసి ప్రజల్లో ప్రభుత్వాల పట్ల ఉన్న నమ్మకాన్ని కాపాడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు పూరేళ్ల నితీష్, (NSC), అంజన్న,గోపాల్,కిరణ్ లు పాల్గొన్నారు.






