18 July, 2026 | 4:03 PM

పట్టణాభివృద్ధికి ప్యాకేజీ ప్రకటించాలి

18-07-2026 03:48 PM

- సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి బెల్లంపల్లి సమస్యలు

- సీఎంను కలిసిన ఎమ్మెల్యే, చైర్పర్సన్

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలోనీ ప్రధాన సమస్యలను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మునిసిపల్  చైర్ పర్సన్ దావస్వాతి విన్నవించారు. సీఎంను గడ్డం వినోద్, చైర్ పర్సన్ దావస్వాతి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బెల్లంపల్లి పట్టణ సమస్యలు, పట్టణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి నిధుల మంజూరు విషయమై వినతిపత్రం అందజేశారు. బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి బెల్లంపల్లి మున్సిపాలిటీలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సమగ్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు.

పట్టణంలోని ప్రధాన, అంతర్గత రోడ్ల విస్తరణ, మురుగు కాలువల నిర్మాణం, పాత డ్రైనేజ్ వ్యవస్థ పునరుద్ధరణ వంటి ప్రధాన సమస్యల్ని వినవించారు. బెల్లంపల్లి పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి కోసం ప్రత్యేక అభివృద్ధి  ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేయాలని కోరారు. అదేవిదంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన అధునాతన వైద్య పరికరాలు, వైద్య నిపుణులను, సరిపడా సిబ్బందిని నియమించాలన్నారు. 

బెల్లంపల్లి పట్టణంలో సింగరేణి ప్రాంతంలో గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న వారికి 76- జీఓ ప్రకారం ఇళ్ల పట్టాల సమస్యను సీఎం కు వివరించారు. బెల్లంపల్లి స్థానిక యువతకు నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు కల్పించేందు గాను బెల్లంపల్లి పట్టణంలో అంబేద్కర్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డినీ కలిసిన వారిలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ కూతురు వర్ష, కాంగ్రెస్ నాయకుడు దావ రమేష్ ఉన్నారు.