18 July, 2026 | 3:55 PM

రామగుండం కమీషనరేట్ లో కోర్టు డ్యూటీ అధికారుల పనితీరు మెరుగుపర్చాలి

18-07-2026 03:51 PM

శిక్షల శాతం పెంచడమే లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా

పెద్దపల్లి జిల్లా,(విజయక్రాంతి): రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కోర్టు డ్యూటీ అధికారుల పనితీరును మరింత మెరుగుపర్చడంతో పాటు కేసుల్లో శిక్షల శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు. శనివారం సీపీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో కోర్టు డ్యూటీ, కోర్టు లైజనింగ్ పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన కీలక సూచనలు చేశారు.

కోర్టు విధులకు సంబంధించిన ప్రతి పనిని నిర్దేశిత గడువులో నాణ్యతతో పూర్తి చేయాలని, విధుల నిర్వహణలో ఎదురయ్యే పరిపాలనా, సాంకేతిక సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమన్లు, ఎన్‌బీడబ్ల్యూలు (నాన్ బెయిలబుల్ వారెంట్లు), ఇతర వారెంట్ల అమలును వేగవంతం చేసి, కోర్టు ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. సాక్షులను సకాలంలో కోర్టుకు హాజరుపరిచే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారికి కోర్టు విచారణపై ముందస్తు అవగాహన కల్పించి ధైర్యంగా, స్పష్టంగా వాంగ్మూలం ఇచ్చేలా మార్గనిర్దేశం చేయాలని సూచించారు.

ప్రతి కేసులో దర్యాప్తు అధికారులు, కోర్టు డ్యూటీ అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే శిక్షల శాతం పెరుగుతుందని సీపీ పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన అధికారులను ప్రతి నెల ప్రోత్సాహక బహుమతులతో సత్కరిస్తామని, బదిలీ అయిన అనంతరం వారు దర్యాప్తు చేసిన కేసుల్లో శిక్షలు పడినా వారికి కూడా గుర్తింపు అందజేస్తామని వెల్లడించారు. అనంతరం పలు కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా కీలకంగా పనిచేసిన కోర్టు డ్యూటీ సిబ్బందిని పోలీస్ కమిషనర్ శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్లు అనిల్ కుమార్, బాబురావు, ఎస్‌ఐ వినీత, కోర్టు డ్యూటీ సిబ్బంది, కోర్టు లైజనింగ్ అధికారులు పాల్గొన్నారు.